ఖమ్మం సిటీ, మార్చి 2 : ‘ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలనా? లేక రాం బందుల రాజ్యమా? అని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూ రు గౌరీశంకర్ ప్రశ్నించారు. ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కాంగ్రెస్ సర్కార్ కూల్చిన పేదల ఇండ్ల ప్రాంతాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అక్కడి నుంచి నగరంలోని టీటీడీసీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. అధైర్యపడకండి, యా వత్ తెలంగాణ సమాజం అండగా ఉం టుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం జూలూరి మీడియాతో మాట్లాడుతూ.. విధ్వంసమైన గాజా పట్టణం.. ఖమ్మంలోని వెలుగుమట్లలో కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానికంగా కూల్చివేసిన ఇండ్లను పరిశీలిస్తే యుద్ధ బీభత్స దృశ్యాన్ని తలపిస్తున్నదని తెలిపారు. కూల్చిన ఇండ్లను ప్రత్యక్షంగా చూస్తే కరగని మనస్సు ఉండదని చెప్పిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇండ్లను కూల్చి ప్రభుత్వం తప్పు చేసిందని విమర్శించారు. ఎనిమిదేండ్ల క్రితం కూలి పనులు చేసుకుని సంపాదించుకున్న పదో పరకో పెట్టి చిన్నగూడు కట్టుకుంటే నేలమట్టం చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు.