Thief arrested | ఖిలావరంగల్ : వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జి ఆర్ పి స్టేషన్లో నిందితుడి వివరాలను సీఐ పీ సురేందర్ శనివారం వెల్లడించారు. వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 4 చింతల్ వైపు తనిఖీలు చేపట్టాం. మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం బంగ్లా తండాకు చెందిన ఇస్లావత్ సురేష్ (30) అనుమానాస్పదంగా కనిపించడంతో అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా అందులో గ్రా.28.645ల బంగారు గొలుసు, మంగళసూత్రం, మూడు జతల చెవి కమ్మలు లభించాయి. వీటి విలువ రూ.2,86,645 ఉంటుంది.
వెంటనే నిందితుడిని అదుపులో తీసుకొని నగలను స్వాధీనం చేసుకున్నాం. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు వరంగల్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికుల వద్ద చోరీ చేసినట్టు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ ఏఎస్ఐ రామకృష్ణ, జి అర్ పి సిబ్బంది రాము, రియాజుద్దీన్, నాగరాజు, రమేష్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.