KU Syllabus | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 7: కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధనల నాణ్యతను మరింత మెరుగుపరిచే దిశగా పాఠ్యప్రణాళికలో విస్తృతమైన, సమకాలీన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే ప్రతాప్‌రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయంలోని సైన్స్ విభాగాధిపతులు, పాఠ్యప్రణాళిక కమిటీ అధ్యక్షుడు, సైన్స్ విభాగాల డీన్ జి.హనుమంతు సమక్షంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేలా, సమాజ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని సూచించారు. 2026- 27 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమలులోకి వచ్చే విధంగా ఒక నెల వ్యవధిలో పాఠ్య ప్రణాళికను పునఃసిద్ధం చేయాలని ఆయా విభాగాలను ఆదేశించారు. ప్రతి సబ్జెక్టుకు అనుగుణంగా భారతీయ జ్ఞాన వ్యవస్థ (ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్)కు సంబంధించిన అంశాలను పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా చేర్చాలని సూచించారు.
భారతదేశానికి చెందిన సంప్రదాయ విజ్ఞానం, శాస్త్రీయ ఆలోచనలు, పరిశోధనా విధానాలు విద్యార్థులకు అవగాహన కలిగేలా ఈ అంశాలు ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలా విలువాధారిత అదనపు కోర్సులు (వాల్యూ అడిషన్ కోర్సులు) ప్రతి విభాగంలో తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. సిలబస్ ను రూపొందించే సమయంలో పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, పరిశ్రమలు, ఇతర సంబంధిత వర్గాల (స్టేక్ హోల్డర్లు) అభిప్రాయాలు, సూచనలు కూడా తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుత ప్రపంచ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తోపాటు క్వాంటం సాంకేతికతల వంటి ఆధునిక, భవిష్యత్ ప్రాధాన్యత కలిగిన అంశాలను పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని ప్రతాప్‌రెడ్డి సూచించారు. ఇది విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీ సామర్థ్యాన్ని పెంచుతుందని, ప్రతి కోర్సుకు సంబంధించి కోర్సు ఫలితాలు, కార్యక్రమ ఫలితాలు, కార్యక్రమానికి ప్రత్యేకమైన ఫలితాలను (కోర్సు అవుట్ కమ్లు, ప్రోగ్రాం అవుట్ కమ్ లు, ప్రోగ్రాం స్పెసిఫిక్ అవుట్ కమ్లు) స్పష్టంగా పాఠ్యప్రణాళికలో పొందుపరచాలని ఆయా విభాగాల అధ్యయన మండలి సభ్యులు(బోర్డు ఆఫ్ స్టడీస్) ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా కోర్సుల రూపకల్పనలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, పరిశోధన దృక్పథం, ఉద్యోగావకాశాలు, సమకాలీన సమాజ సమస్యలకు పరిష్కారాలు సూచించే అంశాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాఠ్యప్రణాళిక విద్యార్థులను ఉద్యోగోన్ముఖులుగా, పరిశోధనాభిలాషులుగా తీర్చిదిద్దేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ సైన్సు విభాగాల విభాగాధిపతులు, పాఠ్యప్రణాళిక అధ్యక్షుడితోపాటు డీన్ ఆచార్య జి.హనుమంతు, పరిక్షల నియంత్రణ అధికారి రాజేందర్, కాంపస్ కాలేజీ టి.మనోహర్, ఐ.క్యు.ఎ.సి. డైరెక్టర్ ఎస్.నరసింహచారి, బి.వెంకట్రామరెడ్డి, మామిడాల ఇస్తారి పాల్గొన్నారు.