Physiological processes | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 19 : శరీరంలోని వృద్ధి, భేదీకరణ, మెటాబాలిజం, అపోప్టోసిస్ వంటి ప్రధాన శారీరక ప్రక్రియలు సెల్ సిగ్నలింగ్ మార్గాల ద్వారా నియంత్రించబడతాయని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ మెడిసిన్, అమెరికాకు చెందిన ప్రొఫెసర్ కె.శ్రీనివాస్ మూర్తి వివరించారు. ఈ మార్గాల్లో ఏర్పడే లోపాలు క్యాన్సర్, మధుమేహం, మెటాబాలిక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులకు కారణమవుతాయని అన్నారు.
హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘మాలిక్యూలార్ బేసిస్ ఆఫ్ మెడిసిన్’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక ఉపన్యాసం చేస్తూ.. సెల్ సర్ఫేస్ రిసెప్టర్లు, కైనేసులు, ఫాస్ఫటేసులు, అంతఃకణ సంకేత అణువులు ఔషధ లక్ష్యాలుగా కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆధునిక ఔషధ అభివృద్ధి ఈ సంకేత అణువులను లక్ష్యంగా చేసుకుని ఎంపికాత్మకంగా పనిచేసే మందుల రూపకల్పనపై దృష్టి సారిస్తోందని చెప్పారు. కణసంకేత మార్గాలపై లోతైన అవగాహన సమర్థవంతమైన, ప్రభావవంతమైన చికిత్సా ఔషధాల అభివృద్ధికి అత్యంత అవసరమని ఆయన తన ప్రసంగంలో వివరించారు.
ఐఐటీ చెన్నైకి చెందిన మరో వక్త ప్రొఫెసర్ ఆర్ సురేష్ క్యాన్సర్ వ్యాధి కారకాలను, వ్యాధి లక్షణాలను, నివారణ చర్యల గురించి వివరించారు.
ఆయుర్వేద వైద్యులు ప్రొఫెసర్ ఏ.శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో జీవరసాయన పరిశోధనలో, వ్యాధుల నివారణలో ఆయుర్వేద వైద్యం అనేది చాలా ప్రాముఖ్యత కలిగిందని తెలిపారు.
ప్రొఫెసర్ ఇస్తారి వైరస్, వాటి వ్యాప్తి విధానం, ముందు జాగ్రత్తలు, చికిత్స విధానాలు గురించి ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ జి. శ్రీనివాస్, సదస్సు కన్వీనర్ పి.రోహిణి, వైస్ ప్రిన్సిపల్స్ రజినీలతా, రాజశేఖర్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ ఏ శ్రీనాథ్, జంతుశాస్త్ర విభాగానికి చెందిన కోఆర్డినేటర్స్ టీడీ దినేష్, పి.గౌరీ, వి.రాజయ్య, స్వామి, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.