Ghooskhor Pandat row | మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఘూస్ఖోర్ పండత్’ చిత్రంపై నెలకొన్న వివాదం సుప్రీంకోర్టు జోక్యంతో కీలక మలుపు తిరిగింది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు దర్శకుడు నీరజ్ పాండే ధర్మాసనానికి హామీ ఇచ్చాడు.
ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా సినిమా టైటిల్ ఉందంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరుగగా.. ఈ విచారణలో దర్శకుడు నీరజ్ పాండే తరపు న్యాయవాదులు కోర్టుకు స్పష్టమైన హామీ ఇచ్చారు. సినిమా టైటిల్‌తో ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశ్యం కాదని, వివాదాస్పదంగా మారిన ఆ టైటిల్‌ను తక్షణమే మార్చుతామని కోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు సినిమా పేరును మారుస్తూ కొత్త టైటిల్‌తో అఫిడవిట్ దాఖలు చేస్తామని వారు పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. భావప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరులను అవమానించేలా ఉండకూడదని హితవు పలికింది. టైటిల్ మార్పుపై మేకర్స్ సానుకూలంగా స్పందించడంతో కోర్టు తదుపరి చర్యలకు సిద్ధమైంది. సినిమా పేరు మార్చాకే సెన్సార్ ప్రక్రియ మరియు విడుదల ఉండాలని తెలిపింది. మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్రలో నీరజ్ పాండే, రితేశ్ షా సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది.