Nani | టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని ప్రయాణం చాలా మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నాని.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఇప్పుడు విజయవంతమైన నిర్మాతగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణీ’ చిత్రంతో మరో ఆసక్తికరమైన అధ్యాయాన్ని ప్రారంభించారు.యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాని సమర్పిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ దర్శకుడు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక హీరో నిర్మాణంలో మరో హీరో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా ప్రారంభంతో నాని, నితిన్‌లకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2005లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రానికి నాని క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో హీరో నితిన్ నటించిన సన్నివేశాలకు క్లాప్ కొట్టిన నాని.. ఇప్పుడు అదే నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రాన్ని నిర్మాతగా సమర్పించడం విశేషంగా మారింది. అప్పట్లో అసిస్టెంట్‌గా ముహూర్తం చూసిన నాని.. ఇప్పుడు నిర్మాతగా అదే హీరో సినిమా ముహూర్తానికి క్లాప్ కొట్టడం అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ రెండు సందర్భాల ఫొటోలను పక్కపక్కన ఉంచి అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
దర్శకుడు కావాలనే కలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాని.. లెజెండరీ దర్శకుడు బాపు వద్ద ‘రాధా గోపాలం’ చిత్రానికి క్లాప్ బాయ్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం కె. రాఘవేంద్రరావు వద్ద కూడా డైరెక్షన్ విభాగంలో అనుభవం సంపాదించారు. అయితే అనుకోకుండా ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా పరిచయమైన నాని, వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస విజయాలు అందుకుని టాలీవుడ్లో మినిమమ్ గ్యారంటీ హీరోగా నిలిచారు. ప్రస్తుతం ఆయన మార్కెట్ వంద కోట్ల స్థాయికి చేరుకోవడం ఆయన కెరీర్ ఎదుగుదలకు నిదర్శనం. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ నాని విభిన్న కథలను ప్రోత్సహిస్తూ తన అభిరుచిని చాటుతున్నారు. ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణీ’ ద్వారా నితిన్‌తో కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం సినీ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.