Sangareddy | మునిపల్లి, ఆగస్టు 4: విద్యార్థులకు సురక్షిత వాతావరణంలో విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలే ఇప్పుడు భయానికి నిలయంగా మారింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తరగతులకు హాజరవుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో గోడలు తడిసి, పైకప్పు బలహీనపడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
మునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రస్తుతం సుమారు 143 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సుమారు 60 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం ఇప్పటికీ వినియోగంలో ఉండటంతో ఎప్పుడు కూలుతాయో తెలియదన్నట్లుగా ఉన్నాయి. అలాంటిది వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తరగతి గదుల గోడలు పూర్తిగా తడిసిపోవడంతో పాటు కొన్ని చోట్ల పగుళ్లు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Munipalli Govt School1
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తరగతి గదుల్లోకి నీరు చేరడంతో గోడలు పూర్తిగా తడిసిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులు కూడా భవనం పరిస్థితి చూసి భయాందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా మారిన పాఠశాల భవనానికి బదులుగా ప్రభుత్వం వెంటనే కొత్త భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. అప్పటి వరకు విద్యార్థులను సురక్షితమైన ప్రత్యామ్నాయ భవనానికి తరలించి తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

Munipalli Govt School2
కాగా, పాఠశాల పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) భీమ్‌సింగ్ తెలిపారు. పై అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైతే ప్రత్యామ్నాయ భవనంలో తరగతులు నిర్వహించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.