Watermelon | పుచ్చకాయ తియ్యగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 92 శాతం నీరు ఉండటం వల్ల వేడి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. తీపి ఎక్కువగా ఉండటంతో పుచ్చకాయ తింటే బరువు పెరుగుతామని చాలామంది భావిస్తారు. అయితే ఇందులో కేలరీలు తక్కువగా ఉండటంతోపాటు బరువు తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పరిమితంగా తీసుకుంటేనే దీని ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు. పుచ్చకాయలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలను ఎంచుకోవాలని సూచిస్తారు. ఈ కోణంలో పుచ్చకాయ మంచి ఎంపికగా చెప్పవచ్చు.
పుచ్చకాయలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒక కప్పు పుచ్చకాయలో కేవలం 46 కేలరీలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గాలంటే తీసుకునే కేలరీల కంటే ఖర్చు చేసే కేలరీలు ఎక్కువగా ఉండాలి. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండటం వల్ల తక్కువ కేలరీలతోనే కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే తగినంత నీరు తీసుకోవడం జీవక్రియను (మెటబాలిజం) మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. పుచ్చకాయలో ఉండే సిట్రులిన్ అనే అమినో ఆమ్లం శరీరంలో అర్జినైన్‌గా మారుతుంది. అర్జినైన్ శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గించి కండరాల నిర్మాణానికి తోడ్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాయామంతో పాటు సరైన ఆహారం తీసుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. పుచ్చకాయలో విటమిన్లు సి, ఎ, బి5, బి6తో పాటు మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించి వ్యాయామం చేయడానికి సహాయపడతాయని పేర్కొంటున్నారు.
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మధ్య మధ్యలో అనారోగ్యకరమైన చిరుతిండ్లు తినాలనే కోరిక తగ్గి, అధికంగా తినకుండా నియంత్రించుకోవడానికి ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండగా, పీచు పదార్థం మాత్రం ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. అయితే పుచ్చకాయను కూడా పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. ఇందులో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ సహజ చక్కెరలు ఉంటాయి. అందువల్ల రోజుకు రెండు కప్పుల వరకు మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. దీనిని మధ్యాహ్నపు చిరుతిండిగా లేదా వ్యాయామం అనంతరం తీసుకోవచ్చు.