హనుమకొండ చౌరస్తా : ఆర్టీసీ సంస్థను నష్టాల నుంచి లాభాలబాటలోకి ( Profitability) తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ( RTC MD Nagireddy ) ఆదేశించారు.
మంగళవారం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా హనుమకొండ, వరంగల్ బస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. వరంగల్ బస్‌స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, హనుమకొండ డిపో, వరంగల్-1, వరంగల్-2 డిపోలతో సహా మొత్తం రెండు బస్టాండ్లు, మూడు డిపోలు, శిక్షణ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రయాణికులతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడి బస్సుల వేళలు, సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణపై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఆర్ఎం కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బస్టాండ్లలో ప్రాథమిక వసతులు, పరిశుభ్రత, తాగునీటి సదుపాయం నిరంతరం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటన, సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. రాజశేఖర్, ఈడీ సోలమన్, సీసీఈ కవిత, వీఎస్ఓ బాబూరావు, వరంగల్ రీజినల్ మేనేజర్, డిప్యూటీ ఆర్ఎం శ్రీహర్ష, డిప్యూటీ ఆర్ఎం కిషన్‌రావు, డిపో మేనేజర్లు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అద్దెబస్ ఓనర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైర్బస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్‌రెడ్డి, వరంగల్ రీజినల్ అధ్యక్షుడు మారిపెల్లి రాంరెడ్డి, కె.సదానందం, ఎండి.హబీబుద్దీన్ ఎండీ నాగిరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.