Miracle Movie | టాలీవుడ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “మిరాకిల్”. ‘సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నిమ్మల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, మూడో షెడ్యూల్‌ను ఈనెల 24 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్లో హెబ్బా పటేల్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషించడం విశేషం. ఈ చిత్రం ద్వారా నాయుడు పెండ్ర విలన్‌గా పరిచయమవుతున్నారు. గ్లామర్, యాక్షన్ కలగలిసిన ఈ చిత్రంలో సీనియర్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.
దర్శకుడు ప్రభాస్ నిమ్మల స్వయంగా కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా సంగీతాన్ని కూడా సమకూర్చడం ఈ సినిమా ప్రత్యేకత. రవి బస్రూర్ వంటి దిగ్గజాల స్ఫూర్తితో రూపొందుతున్న యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమని, ఝాన్సీ, విజయ్ సూర్య వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ “మిరాకిల్” బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.