– నిబందనలకు విరుద్ధంగా ఏజెన్సీ గడుపు పొడిగింపుపై మండిపడ్డ నిర్వాహకులు
– ఎంజీయూ రిజిస్ట్రార్‌కు వినతి అందచేసిన బీఆర్ఎస్ నల్లగొండ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పలు ఏజేన్సీల నిర్వహకులు
రామగిరి, ఆగస్టు 04 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ సేవల టెండర్ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని పలు ఏజెన్సీ నిర్వాహకులు ఆరోపించారు. నిబందనలకు విరుదద్దంగా నల్లగొండలోని భార్గవి ఎంటర్ ప్రైజేస్’ ఏజేన్సీ గడువును మరో సంవత్సరం పాటు పొడిగించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ మంగళవారం ఎంజీయూ రిజిస్ట్రార్ కొప్పుల ఆంజిరెడ్డికి బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భోనగిరి దేవేందర్ తోపాటు పలువురు ఏజెన్సీల నిర్వహకులు వినతి అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన వారికి అన్యాయం చేస్తున్నారని, ఇటీవల యూనివర్సిటీలో అధికారులు ఔట్ సోర్సింగ్ సేవల నిర్వహణ కోసం టెండర్ ప్రక్రియ చేపట్టారని గుర్తు చేశారు.
ఈ టెండర్ లో పాల్గొనేందుకు అనేక ఏజెన్సీలకు అర్హత ఉన్నప్పటికీ, అధికారులు వారికి అవకాశం లేకుండా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు పక్కనబెట్టి, ఇప్పటికే పనిచేస్తున్న భార్గవి ఎంటర్ ప్రైజెస్ కే మళ్లీ ఏడాది పాటు గడువు పొడిగించడం వెనుక అధికారుల హస్తం ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించకుండా ఒకే ఏజెన్సీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గతంలోనూ భార్గవి ఎంట్రర్ ప్రైజేస్ ఏజెన్సీ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన నియామకాలు చేపట్టిందని ఏజెన్సీ నిర్వాహకులు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. ఔట్ సోర్సింగ్ నియామకాల్లో తప్పనిసరిగా అమలు చేయాల్సిన 100 పాయింట్ల రోస్టర్ విధానాన్ని, రిజిర్వేషన్ నిబందనలను పూర్తిగా తొక్కిపెట్టారని విమర్శించారు. అంతేకాకుండా ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ మార్గదర్శకాలను గాలికి వదిలేసి, క్రీడాకారులకు, మాజీ సైనికుల కోటాలను కూడా అమలు చేయకుండా అక్రమ నియామకాలకు పాల్పడ్డారని వివరించారు.
యూనివర్సిటీ నిబంధనలను, ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిన భార్గవి ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. యూనివర్సిటీ పవిత్రతను దెబ్బతీసేలా వ్యహరిస్తునన్నా ఆ ఏజెన్సీని వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, నిబంధనల ప్రకారం పారదర్శకంగా కొత్త టెండర్లు నిర్వహించి అర్హులైన ఏజెన్సీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏజెన్సీల నిర్వాహకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.