The Kerala Story 2 | మనోజ్ బాజ్పేయి చిత్రం ‘ఘూస్ఖోర్ పండత్’ (Ghooskhor Pandat) టైటిల్పై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన తరుణంలో మరో వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ 2’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు (CBFC) ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్ను జారీ చేసింది. దీనివల్ల 14 ఏళ్లు పైబడిన వారు ఈ సినిమాను వీక్షించే అవకాశం లభించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నిర్ణయంపై చిత్ర నిర్మాత విపుల్ అమృత్లాల్ షా స్పందిస్తూ, సెన్సార్ బోర్డు తమ కథలోని నిజాయితీని నమ్మిందని, బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
మత మార్పిడి వంటి సున్నితమైన అంశాలతో రూపొందిన ఈ చిత్రంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. ఇది రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్న ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అని ఆయన అభివర్ణించారు. కేరళలోని లౌకిక సంప్రదాయాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి సినిమాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అయితే నిర్మాత విపుల్ షా మాత్రం, ఈ సినిమా యువతులకు మరియు కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించినదని అందుకే సెన్సార్ బోర్డు సానుకూలంగా స్పందించిందని అభిప్రాయపడ్డారు. కామఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో ఉల్కా గుప్త, అదితి భాటియా మరియు ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను విపుల్ షా నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.