హనుమకొండ చౌరస్తా, మార్చి 7: దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన యూజీసీ(UGC) నూతన ముసాయిదా దేశ సమైక్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని, ఇది భారత రాజ్యాంగం ఉమ్మడి జాబితాలోని విద్యారంగం పట్ల వివిధ రాష్ట్రాలకు కల్పించిన హక్కులను కాలరాయడమేనని పి.డి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వి, ప్రధాన కార్యదర్శి అనిల్ సాయి అన్నారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత(PDSU) ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి.డి.యస్.యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యూజీసీ నూతన ముసాయిదాను వ్యతిరేకిస్తూ మార్చి 18న కాకతీయ విశ్వ విద్యాలయంలో ‘యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సు’ నిర్వహిస్తున్నామని తెలిపారు.
బిజెపి ప్రభుత్వం దేశంలోని విద్యావేత్తలను, మేధావును, ప్రజాస్వామికవాదులను, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా ఏకపక్షంగా విద్యారంగంలో దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక సంస్కరణలకు పూకుంటున్నది. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల కనుసన్నల్లో విద్యా కాషాయీకరణే ధ్యేయంగా, దేశ లౌకిక వ్యవస్థ విచ్ఛిన్నమే లక్ష్యంగా దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీససే కుట్రపూరిత చర్యలకు ఒడిగడుతున్నది.
నూతన జాతీయ విద్యా విధానం 2020, యూజీసీ నూతన ముసాయిదా 2025 తీసుకువచ్చి విద్యార్థుల్లో కుల,
మత తత్వాలతో కూడిన మూఢత్వ భావాలను పెంపొందిస్తూ, ప్రశ్నించే తత్వాన్ని, ప్రజాస్వామిక, మానవీయ లక్షణాలను సమాధి చేయచూస్తున్నదని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల స్వయంప్రతి పత్తిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు, రాష్ట్ర నాయకులు పి.అనూష, కె.యు. అధ్యక్షులు బి.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వి.కావ్య, జిల్లా నాయకులు గణేష్,యాదగిరి పాల్గొన్నారు.