Lottery : అదృష్ట దేవత ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేమని చాలామంది అంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. స్టవ్‌లు రిపేర్ చేసుకునే వ్యక్తికి ఏకంగా రూ.3 కోట్ల లాటరీ తగిలింది. పంజాబ్ (Punjab) లోని మోగా జిల్లా నిహాల్‌సింగ్ వాలా పట్టణానికి చెందిన మహేంద్రసింగ్ (Mahendra Singh).. స్టవ్‌ల రిపేర్ల దుకాణం నడుపుతున్నాడు.
అతడిని అనూహ్యంగా అదృష్టలక్ష్మి వరించింది. గురుగ్రామ్ ఆలయంలో పూజలు చేసి తిరిగివస్తూ పత్రాన్ మార్కెట్లో కనిపించిన ఓ లాటరీ దుకాణంలో ఆయన లాటరీ టికెట్ కొన్నారు. అది నాగాలాండ్ రాష్ట్ర ‘డియర్ మహా శివరాత్రి బంపర్ 2026’ లాటరీ. అయితే మహేంద్రసింగ్ కొన్న టికెట్‌కు మొదటి బహుమతి తగలడంతో ఆయన రూ.3 కోట్లు గెలుచుకున్నారు.
జీవనోపాధి కోసం స్టవ్ రిపేర్ దుకాణం నడుపుతున్న మహేంద్రసింగ్‌కు లాటరీ తగిలిందన్న విషయం పట్టణమంతా తెలియడంతో.. ఆయన తన కుటుంబసభ్యులు, స్థానికులతో కలిసి ఈ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ లాటరీ బంపర్ డ్రా ఫిబ్రవరి 21న తీశారు. ఏజెంట్ కమిషన్, ఇతర మినహాయింపులు పోగా రూ.1.80 కోట్లకు పైగా మహేంద్రసింగ్ చేతికి అందనుందని చెబుతున్నారు.