హనుమకొండ, సెప్టెంబర్ 26 : హనుమకొండ బస్‌స్టేషన్‌లో బస్సులు(Rtc bus) లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ, దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికి అవి సరిపోక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు హనుమకొండ బస్‌స్టేషన్‌కు భారీగా తరలివస్తున్నారు. దీంతో బస్‌స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల సంఖ్యకు తగినట్లుగా బస్సులు లేకపోవడంతో వలన వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అరగంట నుంచి బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడపా, దడపా వచ్చిన బస్సులు ఎక్కేందుకు, సీట్లు దొరకబుచ్చుకునేందుకు నానా తంటాలు పడ్డారు. రాకరాక వచ్చిన బస్సు కోసం ప్రయాణికులు అటు-ఇటు పరుగులు పెడుతున్నారు. సీట్ల కోసం ఎగబడుతున్నారు. సీట్ల కోసం కిటికిలో నుంచి సామాన్లు సైతం బస్సుల్లో వేస్తున్నారు.
ఫ్రీ బస్సు రేవంత్‌రెడ్డిపై మండిపాటు..
హనుమకొండ బస్‌స్టేషన్‌లో దసరా పండుగ సందడి నెలకొంది. ఇసుకేస్తే రాలన్నంతగా ప్రయాణికులతో బస్‌స్టేషన్ నిండిపోయింది. ఆర్టీసీ అధికారులు పండుగ దృష్ట్యా అదనపు బస్సు సర్వీసులను ప్రారం భించారు. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లడానికి ప్రయాణికులు ఆర్టీసీ బస్ పైనే ఆసక్తిచూ పడటంతో రద్దీ పెరిగిపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి మహాలక్ష్మి పథకంతో బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌కు 1284 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలు గ్రామాలకు ప్రయణమయ్యారు. పండుగ ప్రయాణంతో అధికారులు బస్సుల సంఖ్యను పెంచి రద్దీ ఉన్న రూట్లలో అదనపు సర్వీస్‌లను తిప్పుతున్నా అవి సరిపోకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెతిపోస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహాలక్ష్మీ పథకంపై మహిళలు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ ఆర్ఎం డి.విజయభానును వివరణ కోరగా.. ఆర్టీసీ కంట్రోలర్లు హనుమకొండ బస్‌స్టేషన్‌లో సరిపడా బస్సులు ఉన్నాయని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారని, పండుగ సందర్భంగా ఉప్పల్‌కు వేయి అదనపు బస్సులను నడిపిస్తున్నట్లు’ ఆర్ఎం తెలిపారు.