హనుమకొండ చౌరస్తా, మార్చి 7 : జూనియర్ లెక్చరర్స్(Junior Lecturers) అభ్యర్థులు 11న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి ఆరేగంటి నాగరాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. కేయూ మొదటి గేటు వద్ద పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జేఎల్ అభ్యర్థులకు ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి జూనియర్ లెక్చరర్లకు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక మార్పు ప్రారంభమవుతుందని నిరుద్యోగులు నమ్మి ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెడితే ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించకపోతే మాత్రం ఈ నెల 11న ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జయ అభ్యర్థులు సతీష్, పాషా, వంశీ, వెంకటకృష్ణ రమేష్, రాజు, సురేష్ పాల్గొన్నారు.