మహబూబాబాద్ : మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందాలను నిర్వహిస్తున్నారని అది తన దృష్టికి వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు పలు సంక్షేమ కార్యక్రమాల ఎంపిక విషయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొంతమంది నాయకులు లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు తన దృష్టికి వచ్చాయన్నారు.
అదేవిధంగా కొంతమంది లీడర్లు అధికారుల దగ్గరికి పోయి నేను ఎమ్మెల్యే మనిషి అని పేర్లు చెప్పుకొని దందాలను చేస్తున్నారని పేర్కొన్నారు. వాటిపైన నిజనిర్ధారణ చేసి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి నిరుపేదకు అందించే విధంగా కార్యకర్తలు, నాయకులు నిరంతరం శ్రమించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో శాంతన్, రామరాజు, లక్ష్మీనారాయణ, రాజు, శ్రీనివాస్, ఖలీల్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.