సూర్యాపేట, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్టు (ఎన్ఆర్ఈజీఎస్) నిధుల విషయంలో రాజకీయాలు చేస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ద్రోహం చేస్తోంది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికలను రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభు త్వం ఎలాంటి వివక్ష లేకుండా అన్ని పంచాయతీలకు నిధులు ఇచ్చేది. కానీ కాంగ్రెస్ కండువాలు కప్పుకోని సర్పంచ్లు ఉన్న గ్రామాలకు నేడు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించడం లేదు. దీంతో ఆయా పంచాయతీల ప్రజలు చేసిన పాపం ఏంటనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం లో గ్రామాలను గాలికి వదిలేశారు. అలాంటిది తెలంగాణ కోసం పోరాడి సాధించిన కేసీఆర్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కనీవినీ ఎరుగని రీతిలో నెలనెలా కోట్లాది రూపాయలు వెచ్చించడంతో గ్రామాలు పచ్చగా… పరిశుభ్రంగా స్వచ్ఛగా మెరిశాయి. అలాంటి పల్లెలు నేడు తిరోగమన దిశలో పయనిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో రాజకీయాలు తప్ప అభివృద్ధి, సంక్షేమాలను పట్టించుకోవడం లేదు. మాట్లాడితే నిధులు లేవు, దొంగతనం చేసి డబ్బులు తేవాలా అంటున్న సర్కార్ పెద్దలు, వచ్చే కొద్ది పాటి నిధుల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పంచాయతీలకు నయాపైసా విడుదల చేయకపోగా, కేంద్రం నుంచి వచ్చే ఎన్ఆర్ఈజీఎస్ స్కీంకు సైతం రాజకీయ రంగు పులుముతోంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర నిధులతోపాటు కేంద్రం నుంచి ఎటువంటి నిధులు వచ్చినా పార్టీ భేదం లేకుండా అన్ని పంచాయతీలకు సమానంగా నిధులు ఇచ్చేది. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా కాం గ్రెస్ కండువాలు కప్పుకోని సర్పంచ్లు ఉన్న పంచాయతీలకు ఎన్ఆర్ఈజీఎస్ స్కీం, మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కేటాయించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో 60శాతం లేబర్ కాంపోనెంట్ ఉం టుండగా 40శాతం మెటీరియల్ కాంపోనెంట్ కింద డబ్బులు ఇస్తారు. ఈ నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ పంచాయతీకి సమానంగా నిధులు కేటాయించగా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ముద్ర వేసి నిధులు ఇవ్వడం లేదు.
ప్రధానంగా సర్పంచ్, వార్డు మెంబర్లలో సర్పంచ్ కండువా కప్పుకోకపోయినా వార్డు మెంబర్లు ఎక్కువ మంది కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అక్కడ మాత్రం కొంతమేర నిధులు ఇస్తూ కాంగ్రెస్కు బలం లేని పంచాయతీలకు మొం డిచెయ్యి చూపుతోందని సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి గ్రామ పాలనకు అద్దం పట్టేది సర్పంచ్ పదవి. పార్టీలకు అతీతంగా ప్రజల ఆశీస్సులతో ఎన్నికయ్యే నాయకత్వం. కానీ నేడు ఆ పచ్చని గ్రామాల్లో రాజకీయం రగులుతోంది. ప్రజలు మెచ్చి గెలిపించిన సర్పంచ్ తమ పార్టీ కండువా కప్పుకోలేదనే కారణంతోనే.. ప్రభుత్వం నిధులు ఆపేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఎన్ఆర్ఈజీఎస్ నిధుల పంపిణీ ఇందుకు అద్దం పడుతోంది. కేవలం కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటూ పార్టీ కండువా కప్పుకున్న సర్పంచ్లకే నిధులు కేటాయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోతే ఆ సమస్య ఎవరిదీ&పల్లెల్లో రాజకీయాలు గెలుస్తున్నాయా లేక ప్రజల అవసరాలు ఓడి పోతున్నాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పచ్చని గ్రామాలు రాజకీయ రంగులతో కాకుండా అభివృద్ధి అనేరంగులతో మెరవాలని సర్పంచ్లు కోరుతున్నారు.
పంచాయతీలకు వచ్చే నిధుల విషయంలో రాజకీయాలు మానుకోవాలి. పార్టీలను కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించాలే తప్ప కండువా కప్పుకోలేదని నిధులు ఇవ్వకపోవడం నేరంగా పరిగణించాల్సి వస్తుంది. ఫిబ్రవరిలో ప్రతి గ్రామ పంచాయతీకి సంగబంధం సామావేశ నిర్వహణ కోసం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా భవన నిర్మాణం కోసం రూ. 10 లక్షలు మంజూరైతే మా గ్రామానికి నిలిపివేశారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.10 నుంచి 15 లక్షలు వస్తుండగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయ లేదు. తక్షణమే అధికారులు స్పందించి రాజకీయాలు పక్కన పెట్టి పల్లెల్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు విడుదల చేయాలి.