మహబూబాబాద్: యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరమవుతున్నాయి. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. ఆగ్రహించిన రైతన్నలు పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులను అడ్డుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్(Mahabubabad) జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ క్యాంపు కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. శుక్రవారం యూరియా కోసం పట్టణ కేంద్రానికి రెడ్డియాల, కంబాలపల్లి రైతులు వచ్చారు.
అధికారులు యూరియా లేదని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. యూరియా ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని నినాదాలు చేశారు. ఒక దశలో క్యాంపు కార్యాలయ గేట్లను పోలీసులు మూసివేయగా వాటిని తోసుకుంటూ లోపలికి వెళ్లారు. చివరకు ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి రైతులకు యూరియా పంపిణీ చేయాల్సిందిగా సూచించారు. రైతులను పోలీసులు బుజ్జగించి అక్కడి నుంచి పంపించారు.