ములుగు, జూన్2(నమస్తేతెలంగాణ) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాత్రికేయులది కీలక పాత్ర అని, జిల్లా సాధనలో కూడా పాత్రికేయుల పాత్ర మరువలేనిదని జిల్లా అభివృద్దికి అన్ని వర్గాల వారు సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు మంజూరీ విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికి నిజమైన లబ్ధిదారులకే కేటాయిస్తున్నామన్నారు. ఈ నెల 5వ తేదిన జరిగే మంత్రి మండలి సమావేశంలో సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి నూతన మార్గదర్శకాలను చేయనున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు, మంజూరీ కాని నిరుపేదలు ఆందోళన చెందవద్దని సూచించారు. మేడారం మహా జాతరకు ఇప్పటికే రూ.35కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, మరో 100కోట్లతో శాశ్వత పనులను నాణ్యతతో చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.5కోట్లతో మేడారంలోని జంపన్నవాగుపై సుందరీకరణ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో రూ.1కోటి 50లక్షలతో, ఏటూరునాగారంలో రూ.కోటితో మాడల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ములుగులో ఎన్హెచ్కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను గట్టమ్మ వద్ద ఉన్న డిగ్రీ కళాశాల వద్దకు తరలించజేసి కాలేజీ స్థలంలో ప్రజా అవసరాలకు తగిన విధంగా అభివృద్ది చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
కలెక్టర్ టి.ఎస్. దివాకర మాట్లాడుతూ వానకాలం సీజన్లో రైతులు లైసెన్స్లు కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనగోలు చేయాలని అన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నకిలీ విత్తనాలు, లూజు విత్తనాలు అమ్మకాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీవో వెంకటేశ్, డీపీఆర్వో రఫిక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ పాల్గొన్నారు.