కృష్ణ కాలనీ, జనవరి 21 : సింగరేణిలో నెలకొన్న సైట్ విజిట్ దందాపై వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపి, దోషులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, సింగరేణిలో జరుగుతున్న అవినీతిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థను కాంగ్రెస్ నాయకులు తమ జేబు సంస్థగా వాడుకుంటున్నారని, తద్వారా సింగరేణిలో అవినీతి విలయతాండవం చేస్తున్నదన్నారు.
పరిపాలన చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి తీసుకువెళ్లిందని, ఎవడబ్బ సొమ్మని సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ ఆటకు సింగరేణి నిధులు రూ.10 కోట్లు ఖర్చు పెట్టాడో కార్మికులకు తెలపాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అత్యున్నతమైన ఖనిజ సంపద కలిగిన నైనీ బ్లాక్ కాంట్రాక్టును తన బావమరిదికి ఇచ్చేందుకు కుట్రచేసి, సైట్ విజిట్ దందాకు తెర లేపాడన్నారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార రాష్ట్రంలో బొగ్గు శాఖకు మంత్రిగా వచ్చినప్పటి నుండి సింగరేణిలో అవినీతి పెరిగిపోయిందని, మంత్రుల మధ్య వాటాల పంపకం సరిగా తేలకపోవడంతో ఒకరి దందాలను ఒకరు బయట వేసుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రెస్ వాళ్ల సైడ్ విజిట్ దందాపై మాట్లాడిన కుట్రలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ ఇచ్చి విచారణకు పిలవడం సిగ్గుచేటని, ఫోన్ ట్యాపింగ్‌లో తనకు సంబంధం లేదని చెప్పినప్పటికీ ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొకే ప్రయత్నంలో భాగంగానే హరీశ్‌రావును విచారణకు పిలిచారన్నారు.
కాంగ్రెసోళ్ల తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతిని ఎప్పటికప్పుడు బట్టలిప్పుతూ ప్రజలకు తెలియజేస్తూ, కాంగ్రెస్ అవినీతిపై పోరాడుతామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు చీకటి దొంగలని, దమ్ముంటే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిలో అతిపెద్ద కుంభకోణమైన సైట్ విజిట్ దందాపై సీబీఐతో విచారణ జరిపించి, అక్రమారులను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలని, సింగరేణి సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్, టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచీ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, కేంద్ర కమిటీ నాయకులు సదానందం, అవినాష్ రెడ్డి, మల్లారెడ్డి, నాయకులు సెగ్గం సిద్దు, హరీష్ రెడ్డి, జకం రవికుమార్, మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.