ఐనవోలు : చేతికందొచ్చిన పంట పొలం ఎండిపోకూడదనే ఆవేదనతో రైతన్న తెల్లవారుజామునే పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి తనువు చాలించారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు(Electric shock) గురై మృతి చెందిన హృదయ విదారకమైన సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన బాల్నె రమేష్ గౌడ్(45) తన బావి దగ్గర ఉన్న పంట పొలానికి నీళ్లు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై పక్కనే ఉన్న ఓర్రె కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రమేష్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రమేష్‌కు భార్య శోభ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.