భీమదేవరపల్లి, మార్చి 23 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రైతు సంఘం అధ్యక్షుడిగా సన్నిల రవి ఎన్నికయ్యారు. ఆదివారం మండలంలోని ముల్కనూరులో రైతు సంఘం కమిటీ ఎన్నికలు జరిగాయి. నూతన కమిటీ అధ్యక్షునిగా సనిల రవి, ప్రధాన కార్యదర్శిగా బోడ బాలరాజు ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి కుమారస్వామి తోపాటు 15 మంది సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కూరి రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దుచేసి, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఉన్న రైతులకు అమలు చేసి ఆదుకోవాలని కోరారు. కరువులో కొట్టుమిట్టాడుతున్న రైతులకు రైతు భరోసా వెంటనే విడుదల చేసి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంచు కుమారస్వామి, చిట్యాల లక్ష్మారెడ్డి, పూలు తిరుపతి రెడ్డి, కవ్వంపల్లి కిషన్, ఆసరా కుమారస్వామి, పిట్టల రమేష్ తదితరులు పాల్గొన్నారు.