జనగామ రూరల్, ఏప్రిల్ 29: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. జనగామ మండలం గానుగపహాడ్- వడ్లకొండ క్రాస్ రోడ్డుపై కానుగుపాడు, కొర్ర తండా, వడ్లకొండ తో పాటు పలు గ్రామాల రైతుల ధాన్యం కొనుగోలు చేపట్టాలని, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వారం రోజుల్లో తరలించే వారిని ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడం తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
రైతుల నుండి సేకరించిన ధాన్యమును మిల్లులకు తరలించడానికి అధికారులు పూర్తిగా విఫలమయ్యా రన్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో భారీగా ధాన్యం నిలిచి ఉందని వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకుని ప్రతిరోజు ధాన్యం తరలించాలన్నారు. రైతుల ధర్నా విషయం తెలుసుకొని ఆర్డీవో గోపిరామ్, సీఐ సత్యనారాయణ రెడ్డి, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పారు. రైతులు పోలీసులకు వాగ్వావదం జరగడంతో ఆర్డీవో కలుగజేసుకొని ప్రతిరోజు లారీలను పంపిస్తామని కొనుగోలు చేసిన ధాన్యంలో వెనువెంటనే మిల్లులకు తరలిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు