హనుమకొండ చౌరస్తా, మార్చి 30: కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ కళ్యాణ మండపం పారంభించి రెండేళ్లు పూర్తిచేసుకున్నప్పటికీ ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా తొలిగించిన కట్టడం రాళ్లను ఒకదానిపై ఒకటి పేరుస్తూ పునర్నిర్మించారు. 1163లో కాకతీయరాజు ఒకటో రుద్రుడి కాలంలో 1000 స్తంభాల గుడిని నిర్మించారు. భారీ శిలలను ఉపయోగించి డంగు సున్నం, కరక్కాయపొడి, బెల్లం, ఇటుక పొడి మిశ్రమంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. కొన్నేళ్లుగా ఒక్కో స్తంభం కుంగిపోతుండటంతో వాటిని తొలిగించి మళ్లీ పునర్నిర్మాణం చేశారు. కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో 119 కొత్త స్తంభాల ఏర్పాటు చేశారు.
సిమెంట్, ఇనుము వాడకుండా ప్రాచీన పద్ధతిలో ఈ పండపాన్ని పునరుద్దరించారు. ఇంకా పూర్తిగా పనులు పూర్తికాకముందే 2024 మార్చి 8న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎంతో హడావుడిగా ప్రారంభించారు. రెండేళ్లు పూర్తయినప్పటికీ ఇంకా 10 శాతం పనులు అలాగే నిలిచిపోయాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి భక్తులకు అంకితమిచ్చినప్పటికీ కళ్యాణమండపంలోకి ఎవ్వరినీ అనుమతించడంలేదు. ఇంకా పది శాతం పనులు అలాగే ఉండిపోయాయి. వాటర్ప్రూఫింగ్, దక్షణం వైపు పైకప్పు పనులు మిగిలిపోయాయి. రెండు నెలల క్రితం కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ నిఖిల్దాస్ రెండోదశ పనులకు పూజలు చేసి ప్రారంభించినప్పటికీ ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
కొనసాగుతున్న పనులు..
కాలక్రమంలో కళ్యాణ మండపం బలహీనంగా మారడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తొలిగించింది. వేయిస్తంభాల గుడి కట్టడం చెక్కు చెదరలేదు కానీ దానికి ఎదురుగా ఉన్న ఈ కళ్యాణ మండపం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇందుకు కారణం దాని కింది నుంచి ప్రవహించిన నీటిపాయగా గుర్తించారు. నీటి ప్రవాహం వలన పునాదిలో ఇసుక తొలిగిపోయి రాతి స్తంభాలు కుంగి మండపం క్రమంగా పక్కకు ఒరిగిపోవడం జరిగింది. మండపం కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన కేంద్ర పురావస్తుశాఖ 2005లో పునర్నిర్మాణమనే మహాఘట్టానికి శ్రీకారం చుట్టింది. పనులు చేపట్టిన తర్వాత అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. నిధుల కొరత కారణంగా పనులు ఆశించినస్థాయిలో ముందుకు సాగలేదు. 2024 మార్చిలో కళ్యాణ మండపం పనులు పూర్తయినట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు.
పగిలిన బండ అలాగే..
కేంద్ర పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేనితనం కళ్యాణమండపం పనులు నిలిచిపోయాయి. 3000 శిలలు, గ్రానైట్ కళాఖండాలు, రాతి స్తంభాలు పాత కట్టడం తొలిగించినప్పుడు వెలికితీసి క్రమ పద్ధతిలో నెంబర్లు వేసి వాటిని తిరిగి పునర్నిర్మించారు. వీటిలో కొన్ని స్తంభాలు పగిలిపోగా శిల్పులతో మళ్లీ చెక్కించి కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించారు. పై కప్పు నిర్మాణంలో పగిలిన బండ పగిలిపోయింది. పెద్దపెద్ద బండలను అమర్చేక్రమంలో ఒక బండ పగిలిపోయింది. దాన్ని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు అలాగే ఉంచారు. పైకప్పు మధ్యలో అక్కడక్కడా మధ్యలో ఉన్న గ్యాప్లో చిన్నచిన్న బండలను పేర్చారు.
ఇంకా పది శాతం పనులు పెండింగ్
మొదటి దశ పనుల్లో భాగంగా రూ.15 కోట్లతో కళ్యాణ మండపానికి శిల్పులు తుది మెరుగులు దిద్దాదారు. తమిళనాడుకు చెందిన స్తపతి(వాస్తుశిల్పి) శివకుమార్ ఆధ్వర్యంలో 30 మంది శిల్పులు నెలరోజులుగా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారు. పునరుద్దరణకు మొత్తం రూ.15 కోట్లు వెచ్చించి ఎట్టకేలకు 80 శాతం పనులు పూర్తిచేశారు. ఇంకా పూర్తిగా పనులు పూర్తికాకముందే కిషన్రెడ్డి రెండేళ్ల క్రితం కళ్యాణమండపం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. నిధుల కొరత కారణంగా పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా రెండోదశ పనుల కింద వాటర్ ప్రూఫింగ్, మూడోదశ కింద దక్షణం వైపు పైకప్పు నిర్మాణం చేయాల్సి ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్టింపులేనితనంతో ఇంకా కళ్యాణమండపం ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు.
రెండోదశ పనులు వాటర్ప్రూఫింగ్, పైకప్పు కల్యాణ మండప పైకప్పు నీటి పారుదల అందించడం కోసం, దక్షణం వైపు పైకప్పు నిర్మాణం కోసం రెండోదశ పనులకు జనవరి 9న శంకుస్థాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ డాక్టర్ నిఖిల్దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణచైతన్య, కన్జర్వేషన్ అసిస్టెంట్ ఎం.మల్లేశం, సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ ఎంఎస్ అజిత్, నిట్ ప్రొఫెసర్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇంటెక్ కన్వీనర్ పాండు రంగారావుతో కలిసి పూజలు చేసి పనులు ప్రారంభించి మమ అనిపించారు.
రెండు నెలలు పూర్తయినప్పటికీ ఇంకా నిధులు మంజూరు కాలేదు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు. నిధులు మంజూరీ చేయించకపోవడంపై వరంగల్ ఎంపీ, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీక్షించేందుకు ప్రజలను లోపలికి అనుమతించడంలేదు. కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డు నిలిపి లోపలికి పంపించడంలేదు.
ఇంకా నిధులు మంజూరు కాలేదు
వేయిస్తంభాల దేవాలయంలోని కల్యాణ మండపం మొదటి దశ పనులు పూర్తి కాగా రెండోదశ పనులు కళ్యాణ మండపం పైన వాటర్ ఫ్రూఫింగ్ తర్వాత మూడోదశ పనులు రూ.6 కోట్లతో కల్యాణ మండప దక్షిణ భాగం పై కప్పు పనులు మిగిలి ఉన్నాయి. ఇంకా పది శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. రూ.6 కోట్ల అంచనా వ్యయంతో వాటర్ ప్రూఫింగ్, పై కప్పు పనులు పూర్తి చేస్తాం. ఇంకా నిధులు మంజూరు కాలేదు.
– అజిత్ ఎంఎస్, కేంద్ర పురావస్తుశాఖ జిల్లా అధికారి