ACB raids | భీమదేవరపల్లి, జూన్ 26 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం వరంగల్ ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. సుమారు మూడు గంటలపాటు సోదాలు జరిపిన అనంతరం వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కార్యాలయానికి వస్తే రైటర్ల ద్వారా కట్టాల్సిన చలాన్ కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తమకు పక్కా సమాచారం ఉందన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తాము ఆకస్మికంగా దాడులు చేయగా కార్యాలయంలో నలుగురు డాక్యుమెంటరీ రైటర్లున్నట్లు తెలిపారు. వారిని సోదాలు చేయగా రూ. 96,870 లభించినట్లు చెప్పారు. వెంటనే ఆ డబ్బును సీజ్ చేసినట్లు వెల్లడించారు.
అనంతరం కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించగా 2023-2024 సంవత్సరానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు తమకు లభించినట్లు తెలిపారు. అప్పటి డాక్యుమెంట్లను జిల్లా కార్యాలయానికి పంపించకుండా ఎందుకు ఇక్కడే పదిలపరిచారో విచారణలో వెల్లడౌతుందన్నారు.
ఎవరైనా డాక్యుమెంట్ కోసం వస్తే రైటర్ల పేర్లు నమోదు చేస్తున్నారని అది చట్ట విరుద్ధమన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా, ఎవరైనా అధికారులు పనులు చేయడానికి డబ్బులు అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని కోరారు. ఈ తనిఖీల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎస్ రాజు, ఎల్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Also :
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి