జగిత్యాల రూరల్ జూన్ 26 : గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా దొరికే చింత చిగురు ప్రస్తుతం ధర కొండెక్కి మరింత ప్రియమైంది. కేజీ ధర 200 పలుకుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ జంట నగరాలలో పెద్ద పెద్ద పట్టణాల్లో చింతచిగురు మార్కెట్లో విక్రయిస్తుండేవారు. కానీ, ప్రస్తుతం జిల్లా కేంద్రంలో కూడా చింతచిగురును అమ్ముతున్నారు. గతంలో గ్రామాల్లో ఇంటి ఆవరణలోని పెరట్లో, రోడ్లకు ఇరువైపున, వ్యవసాయ బావి దగ్గర చింత చెట్లు ఉండేవి.
నేడు చింత చెట్లు కనుమరుగవుతున్నాయి. గ్రామాల్లో గతంలో ఉచితంగానే చింతచిగురును తెంపుకునేవారు. కానీ ప్రస్తుతం చింతచిగురుకు డిమాండ్ ఏర్పడింది. జిల్లా కేంద్రాలే కాక మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో సైతం చింతచిగురు విక్రయిస్తున్నారంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, చింత చిగురు, పెసరపప్పు, వట్టి చాపలు, చింత చిగురు చెట్ని సాంబార్లో ఎక్కువగా కలిపి రుచి కోసం వంట చేస్తుంటారు. ఆరోగ్యానికి కూడా చింత చిగురు ఎతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.