Bath | తిన్న తరువాత స్నానం చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ చాలా మంది పెద్దగా ఆలోచించకుండా తిన్న తరువాత వెంటనే స్నానం చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా అనిపించినా, కొన్ని సందర్భాల్లో వెంటనే స్నానం చేయడం శరీరానికి అంత మంచిది కాకపోవచ్చు. జీర్ణక్రియ అనేది వెంటనే జరిగిపోయే ప్రక్రియ కాదు. ఆహారం జీర్ణం అవ్వడానికి కొంత సమయంతో పాటు కొంత శక్తి కూడా అవసరం. భోజనం చేసిన తరువాత స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి. దీంతో జీర్ణక్రియకు కొంత అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
భోజనం చేసిన తరువాత శరీరం జీర్ణక్రియ మోడ్ లోకి వెళ్లిపోతుంది. ఆ సమయంలో రక్తం ఎక్కువగా పొట్టకు సరఫరా అవుతుంది. జీర్ణక్రియ ఎంజైమ్ లు పని చేయడం మొదలుఅవుతాయి. శరీరం మొత్తం ఆహారాన్ని జీర్ణం చేయడానికి ప్రయత్నిస్తుంది. భోజనం చేసిన తరువాత శరీరం దృష్టి అంతా ఆహారం జీర్ణం చేయడంపైనే ఉంటుంది. ఈ సమయంలో వేడి లేదా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం తన దృష్టిని శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వైపు మళ్లిస్తుంది. శరీరం ఉష్ణోగ్రతను నిర్వహించడానికి రక్తప్రసరణను సర్దుబాటు చేస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ కొంత సేపు అలస్యం అవుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, పొట్ట బరువుగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
కనుక భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదని భోజనం చేసిన 30 నుండి 45 నిమిషాల తరువాత స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణక్రియ పూర్తిగా మొదలైన తరువాత స్నానం చేయడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. కొన్ని సార్లు సాధారణంగా తీసుకునే విషయాలు కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని, భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం అంత మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.