ములుగు: ములుగు జిల్లాలోని మల్లంపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ (SRSP) కాలువపై బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. వాహనాలను దారిమళ్లిస్తున్నారు. కాగా, వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి ప్రారంభమైన వాన శుక్రవారం ఉదయం కూడా కురుస్తూనే ఉన్నది.
దీంతో గీసిగొండలో 92.9 మిల్లీమీటర్లు, వరంగల్ లో 70.9 మిల్లీమీటర్లు, ఖిలావరంగల్ లో 65.3 మిల్లీమీటర్ల భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్ధన్నపేటలో 55.8 మిల్లీమీటర్లు, నెక్కొండలో 55.4 మిల్లీమీటర్లు, పర్వతగిరిలో 53.8 మిల్లీమీటర్లు, ఖానాపూర్ లో 40.3 మిల్లీమీటర్లు, నర్సంపేటలో 40.0 మిల్లీమీటర్లు, చెన్నారావుపేటలో 39.3 మిల్లీమీటర్లు, సంగెమ్ లో 32.2 మిల్లీమీటర్లు, దుగ్గొండిలో 28.8 మిల్లీమీటర్లు, నల్ల పెళ్లిలో 25.7 మిల్లీమీటర్లు, రాయపర్తి లో 21.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.