మేడారం జనసంద్రమవుతున్నది.. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుత్తున్న తల్లులను తనివితీరా కొలిచేందుకు బారులు తీరుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ర్టాల్లోని ప్రజలు వన దేవతల దర్శనానికి తరలివస్తున్నారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు, కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని తల్లులకు ప్రీతికరమైన ఎత్తు బెల్లం, ఒడిబియ్యం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించారు. సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజును దర్శించుకున్నారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో మొక్కులు చెల్లించి తల్లుల దీవెనలు పొందుతున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో సుదూర ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చే భక్తులు జాతర ప్రాంగణంలో విడిది చేస్తున్నారు.
– తాడ్వాయి, ఫిబ్రవరి 5