ములుగు, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)/ ములుగు టౌన్ : మేడారం సమ్మక-సారలమ్మ మహా జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తుల స్మార్ట్ఫోన్లలో కనిపించనుంది. జాతర పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసి కలెక్టర్ కృష్ణ ఆదిత్య నేతృత్వంలో ‘మేడారం జాతర గైడ్ అఫీషియల్’ అనే మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వె సులుబాటు కల్పించారు. ప్లే స్టోర్‌లో MEDARAM JATHARA GUIDE OFFFICIAL అని టైప్ చేసిన వెంటనే ఫోన్లో యాప్ ప్రత్యక్షమవుతుంది. దీనిని డౌన్లోడ్ చేసుకున్న అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటంతో కూడిన యాప్ ప్రదర్శితమవుతోంది. డౌన్లోడ్ చేసుకున్న వారి పేరు, సెల్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసిన అనంతరం యాప్‌లో మేడారానికి సంబంధించిన పూర్తి సమాచారం కనిపిస్తుంది. యాప్‌లో భక్తులకు అవసరమైన పూర్తి వివరాలు పొందుపరిచారు. వ్యాక్సినేషన్ కేంద్రాలు, మరుగుదొడ్లు నిర్మించిన ప్రాంతాలు, జంపన్నవాగు వద్ద నిర్మించిన స్నానఘట్టాలు, జాతర ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాలు, మెడికల్ క్యాంపులు, వాహన పారింగ్ స్థలాలు, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, జాతరలోని ముఖ్య వివరాలతోపాటు నాలుగు రోజులపాటు రోజువారీగా నిర్వహించే ముఖ్య పూజలు, ఆర్టీసీ బస్ స్టాండ్‌లో బస్సులు ఏర్పాటు, తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొనేందుకు మిస్సింగ్ కేంద్రాల వివరాలు ఉంటాయి. అంతేకాకుండా జాతర విశిష్టతను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించేందుకు ప్రత్యేక వెబ్సైట్ (www. medaramjathara.com)ను ప్రారంభించారు.
వివిధ ప్రాంతాల నుంచి జాతరకు చేరుకునేందుకు రోడ్డు మార్గాలు, భక్తులు విడిది చేసే ప్రాంతాలు, జాతర సందర్భంగా వివిధ విభాగాల్లో నిర్వహించే పోటీలు తదితర వివరాలతో పాటు జాతరకు రోడ్డు మార్గాన వచ్చే క్రమంలో పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలను అధికారులు పొందుపరిచారు. అదేవిధంగా వివిధ శాఖల ద్వారా భక్తులకు కల్పించిన సౌకర్యాల వివరాలను కూడా ఈ యాప్‌లో రూపొందించారు. ముఖ్యంగా పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందుతున్న సేవలను ప్రత్యేకంగా పొందుపరిచారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తులు జాతరకు సంబంధించిన ఫొటోలు వీడియోలను అప్లోడ్ చేసే వెసులుబాటు కూడా ఈ యాప్‌లో అధికారులు కల్పించారు.
మహా జాతర ప్రత్యేక వెబ్సైట్, అధికారిక ఆండ్రాయిడ్ యాప్‌ను కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య గురువారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేడారం జాతర ఇన్చార్జి డీసీపీ గౌస్ ఆలం, ఏఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, కలెక్టరేట్ ఏవో, సూపరింటెండెంట్ విజయభాస్కర్‌రెడ్డి, విశ్వప్రసాద్, ఈడీఎం దేవేందర్ పాల్గొన్నారు.