యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): బీబీనగర్ మండలం కొండమడుగు పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు తేలింది. 2020-2021 నుంచి 2024-25వరకు పంచాయతీ నిధులు రూ.1,48,63,973 నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేశారు. ఇందులో ఎంసీ ట్రేడర్స్కు రూ.70.22 లక్షలు చెల్లించగా, రూ.84.67లక్షలు సిబ్బంది ద్వారా ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఎంబీ రికార్డులు, ఓచర్లు లేకుండా నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. కొన్ని నిధులను దుబారా ఖర్చులకు వినియోగించారు.
2025 ఫిబ్రవరిలో అప్పటి అడిషనల్ కలెక్టర్ గంగాధర్ కొండమడుగులో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టగా, జీపీ నిధులు దుర్వినియోగమైనట్లు ఫిర్యాదు రావడంతో విచారణకు ఆదేశించారు. డీపీవో ఆదేశాల మేరకు డీఎల్పీవో విచారణ చేపట్టి, అవకతవకలు జరిగినట్లు నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత నివేదిక బయటకు రావడంతో గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. అదే సమయంలో డిప్యూటీ సీఈవోగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో మరో కమిటీని నియమించారు.
సుదీర్ఘ విచారణ అనంతరం మొత్తం రూ.1.48 కోట్ల అవినీతి జరిగినట్లు తేల్చారు. ఇందులో భాగంగా మాజీ సర్పంచ్ కడెం లత, ఉప సర్పంచ్ రంగ కృష్ణవేణికి బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా అప్పటి ఎంపీవో మాజిద్ హయాంలో 63.14 లక్షలు, స్వాతి పని చేసిన సమయంలో రూ.58.97లక్షలు దుర్వినియోగమైనట్లు పేర్కొంటూ వారిద్దరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పంచాయతీ రాజ్ చట్టం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉత్తర్వుల ప్రకారం వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు. నిర్ణీత వ్యవధిలో సంజాయిషీ ఇవ్వని పక్షంలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.