ములుగు రూరల్, మే 31: భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రాంతం హద్దుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లిఖార్జునరావు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన సమావేశంలో తోట మల్లిఖార్జున రావు మాట్లాడుతూ.. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించిన ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలంలో సరిహద్దుల సమస్యలు, పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపడం లేదని విమర్శించారు.
పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించిన గ్రామంలోనే సమస్యలు పరిష్కరించకపోతే.. ఇక రాష్ట్రమంతటా ఎలా సమస్యలు పరిష్కరిస్తారని తోట మల్లిఖార్జున రావు ప్రశ్నించారు. భూమి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకంగా ఉండే విధంగా ప్రతి పేదవాడికి ఇండ్లు అందించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల ఏరివేతను ఆపి వేసి వారితో చర్చలు జరపాలని సూచించారు. నక్సలైట్లు ఉగ్రవాదులు కాదని.. వారు పోరాడేది సమానత్వం కోసమేనని చెప్పారు. వారితో వెంటనే చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కావడం లేదని తోట మల్లిఖార్జునరావు తెలిపారు. మంత్రులు చెప్పే లెక్కలకు, అధికారులు చెప్పే లెక్కలకు అస్సలు పొంతన ఉండటం లేదని విమర్శించారు. తక్షణమే వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.