Kunamneni Sambasivarao | కురవి, జూలై 05: కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరితరం కాదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులను అంతం చేయడం అడాల్ఫ్ హిట్లర్ వల్లే కాలేదు.. అమిత్ షా నీ వల్ల అవుతుందా అని సవాలు విసిరారు. మహబూబాబాద్ జిల్లా సీపీఐ మహాసభల సందర్భంగా కురవి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో ఉన్న కమ్యూనిస్టులను అంతం చేస్తానని చెప్పి నంబాల కేశవరావును హత్య చేశారని తెలిపారు. కేశవరావును హత్య చేస్తే కోటి మంది కమ్యూనిస్టులు పుడుతారని అన్నారు.
అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజల కోసం కమ్యూనిస్టులు పోరాటం చేస్తారని కూనంనేని సాంబశివరావు వివరించారు. పదవులు ముఖ్యం కాదని, ప్రజలకు నష్టం చేస్తే కాంగ్రెస్ గతి కూడా అంతేనని విమర్శించారు. పొత్తులు రాజకీయ ఎత్తుగడల కోసమేనని, ప్రభుత్వాలు ప్రజలను విస్మరించినప్పుడు పోరాటం చేయడానికి సీపీఐ నాయకులు సిద్ధంగా ఉంటారని తెలిపారు. డిసెంబర్ 26న ఖమ్మంలో సీపీఐ వందేళ్ల పండుగ చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్త సీపీఐ నేతలందరితో కలిసి వేడుకలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టులు మావాళ్లేనని, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఎర్రజెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు మా వాళ్లేనన్నారు. సీపీఐ 1951 వరకు సాయుధ పోరాటం చేసిందని, పరిస్థితులకు అనుగుణంగా ఆయుధాలను జమ్మిచెట్టుపై పెట్టడం జరిగిందన్నారు. ఎర్రజెండా పార్టీలన్ని ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని, ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరాలన్నారు.
ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలి: తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు
ఎన్నికల వరకే పొత్తులుంటాయని, ప్రజాసమస్యలను విస్మరిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిని మరిచిపోతే ప్రజల చేతుల్లో భంగపాటు తప్పదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం మరో ఉద్యమం చేపడుతామన్నారు. ప్రజల సమస్యలపై సీపీఐ పోరు చేస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐని ఆదరించాలని పిలుపునిచ్చారు.