హైదరాబాద్, మార్చి 9(నమస్తే తెలంగా ణ): కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితుల కు ఉద్యోగాలు ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్‌తో కలిసి సోమవారం ఆయన దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవతో సికింద్రాబాద్ రైల్ నిలయంలో భేటీ అయ్యారు. వినతి ప త్రం అందజేసి పలు సమస్యలను జీఎం దృష్టి కి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో వినోద్‌కుమార్ మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ ఏ ర్పాటు కోసం 40 ఏండ్లుగా ఆ ప్రాంత ప్రజ లు, ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ సర్కార్ రూ.380 కోట్ల విలువైన 160 ఎకరాలు సేకరించి ప్రాజెక్టు ప్రారంభానికి కీలక అడ్డంకిని తొలగించిందని వెల్లడించారు.
పదేండ్ల క్రితం కేంద్రం వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రకటన చేసిందని చెప్పారు. 2023 జూలై 8న ప్రధాని మోదీ కాజీపేటలో రైల్వే వ్యాగన్ యూనిట్‌కు మాత్రమే శంకుస్థాపన చేయడంతో స్థానికులు నిరాశకు గురయ్యారని చెప్పారు. ఈ క్రమంలో 2024 సెప్టెంబర్ 18న రైల్వేబోర్డు.. సౌత్‌సెంట్రల్ రైల్వే జీఎంకు రాసిన లేఖలో వ్యాగన్ తయారీ యూనిట్‌ను కోచ్ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేయాలని సూచించిందని గుర్తుచేశారు. జీఎంతో భేటీ సందర్భంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించి పూర్తి స్పష్టత కోసం అధికారిక గెజిట్‌ను విడుదల చేయాలని కోరినట్టు వెల్లడించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు శుభపరిణామమని, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
లాతూర్ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలి
మహారాష్ట్రలోని లాతూర్ కోచ్ ఫ్యాక్టరీ ఏ ర్పాటు సమయంలో ఇచ్చిన ఉద్యోగ ప్యాకేజీని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు ఇవ్వాలని జీఎంను వినోద్‌కుమార్ కోరా రు. ఉద్యోగాల కల్పనలో స్థానిక యువతకు 80% రిజర్వేషన్లు కేటాయించాలని, వరంగల్ జిల్లాలో పలుచోట్ల రైల్వే, ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని, నిర్వాసిత రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాల పెంపునకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు రైల్వే జీఎం శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారని వినోద్‌కుమార్ తెలిపారు. కాజీపేట జంక్షన్ ఉత్తర-దక్షిణ రైల్వే కారిడార్‌ను కలుపుతుందని, ఈ నేపథ్యంలో ప్రాంతీయ కార్యకలపాలు, నిర్వహణను మెరుగుపరిచే లక్ష్యంతో కాజీపేట రైల్వే డివిజన్ స్థాపనకు రైల్వే బోర్డుకు సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తానని రైల్వే జీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు.