ఆడబిడ్డలపై కాంగ్రెస్ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తుండడంపై బీఆర్ఎస్ కన్నెర్రజేసింది. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కుట్రలు చేయడంపై ఆగ్రహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపింది. జిల్లా, నియోజకవర్గ, మండలకేంద్రాల్లో రోడ్లపై రాస్తారోకోలు చేపట్టింది. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసింది. సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినదించింది. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేసింది. కాంగ్రెస్ సర్కారు పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని, కోర్టు సాకులు చూపుతూ కల్యాణ లక్ష్మి పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని మండిపడింది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది.

కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై బీఆర్ఎస్ రణభేరి మోగించింది. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్ స్థానిక నాయకులతో కలిసి నిరసన తెలిపారు. హుజూరాబాద్ పట్టణంలోని తహసీల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు.
అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. మానకొండూర్‌లో నియోజకవర్గ స్థాయి మహాధర్నా నిర్వహించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ హాజరయ్యారు. గంగాధర ఎంపీడీవో కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. చొప్పదండిలో తహసీల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీ తీశారు. అంబేదర్చౌక్ వద్ద ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల బీడీ కార్మికులు, వృద్ధులు, పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ బీడీ కార్మికులు, వృద్ధులతో కలిసి నిరసన తెలిపారు.
