ఆదిలాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ నియోజకవర్గలోని కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతం అయ్యాయి. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు, ఇతర నాయకులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంకాగానే ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి వచ్చారు.
అక్కడే ఉన్న ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ సంజీవ్‌రెడ్డి సీనియర్ నాయకుడిగా ఉన్నారని పీఐసీ కమిటీలో ఆయనకు సభ్యుడిగా తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌కు సూచించారు. దీంతో సమావేశంలో ఉన్న ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆయన వర్గీయులు అభ్యంతరం తెలిపారు. తమ పేర్లు కమిటీలో లేవంటూ నాయకులను నిలదీశారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్‌తో గొడవకు దిగగా ఆయన సమావేశం నుంచి బయటకు వెల్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన సంజీవ్‌రెడ్డిని పీఏసీ కమిటీలో ఎలా చేర్చుకుంటారంటూ కంది వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న శ్రీనివాస్‌రెడ్డి, సమావేశంలో సంజీవ్‌రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పరస్పర దూషణలకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన సంజీవరెడ్డి కూడా కందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు కానివారు బయటకు వెళ్లాలని సచిన్ సావంత్ సూచించడంతో సంజీవ్‌రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు.
ఇద్దరు నాయకులకు షోకాజ్ నోటీసులు
పీఏసీ సమావేశం ఆదిలాబాద్ నియోజకవర్గ నాయకుల వర్గ విభేదాలకు వేదికైంది. ఇద్దరు నాయకులను సర్ది చెప్పడానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి జూపల్లి కృష్ణారావులు ప్రయత్నించిన వారు వినకపోవడంతో పరిస్థితి అందుబాటులోకి రాలేదు. నాయకులు కంది శ్రీనివాస్‌రెడ్డి, సంజీవ్రెడ్డిలపై సచిన్ సావంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నాయకుల పరస్పర దూషణలో సమావేశం రచ్చరచ్చగా మారింది. ఇద్దరు నాయకుల మధ్య గొడవను తీవ్రంగా పరిగణించిన ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కంది శ్రీనివాస్‌రెడ్డి, సంజీవ్రెడ్డిలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. చివరకు స్థానిక, పోలీసులు ఇరువర్గాలను సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. సమావేశంలో గొడవ చేసిన వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ తెలిపారు. పీఏసీ సభ్యులను తాను ఎంపిక చేయలేదని, సమావేశంలో నాయకుల బూతు పదజాలం అధిష్టానం పెద్దలు స్వయంగా చూశారన్నారు.
టికెట్ రాదని కంది శ్రీనివాస్ రెడ్డి గొడవ
నేను అసలైన కాంగ్రెస్ కార్యకర్తనని, కంది శ్రీనివాస్‌రెడ్డి వేరే పార్టీలోని కాంగ్రెస్‌లో చేరారని సంజీవ్‌రెడ్డి అన్నారు. 40 సంవత్సరాలుగా తాను పార్టీలో ఉన్నట్లు తెలిపారు. కంది స్థానికంగా ఉండరని, వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని ఉద్దేశంతో కంది శ్రీనివాస్‌రెడ్డి కావాలని గొడవకు దిగారన్నారు. తాను కాంగ్రెస్‌లో ఉంటూ టికెట్ కోసం ప్రయత్నం చేస్తానని అన్నారు. బాగా చదువుకున్న అని చెప్పుకుంటున్నారని, మంచి కళాశాలల్లో చదువునే మాటలు ఇలా ఉండవని తెలిపారు.