సిటీబ్యూరో: మహాత్మా గాంధీ బతికే ఉంటే… వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టును వ్యతిరేకించేవారని, అభివృద్ధి పేరిట జరిగే పర్యావరణ విధ్వంసకరమైన విధానాలను అడ్డుకునేవారని ప్రజా సంఘాలు స్పష్టం చేశాయి. అశాస్త్రీయ విధానాలతో జరిగే పర్యావరణ వినాశనాన్ని అడ్డుకుంటామని మేధావులు, పౌర హక్కుల, పర్యావరణ నిపుణులు చెప్పారు. ‘మూసీ సజీవంగా ఉండాలి.. పునర్జీవం పేరిట చంపకూడదు’ అంటూ మూసీ జన్ ఆందోళన్, హ్యూమన్ రైట్ ఫోరం, డబ్ల్యూ టూ జేఏసీ, ఎన్ఏపీఎం, ఛత్రి, పీవోడబ్ల్యూ, ైక్లెమెట్ ఫ్రంట్ తెలంగాణ, ఈజేఎఫ్తోపాటు పౌర, సామాజిక, పర్యావరణ పరిరక్షణ స్వచ్చంద సంస్థలు, ప్రొ. హరగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్‌తో పాటు, రిటైర్డ్ సైంటిస్టులు బాబురావు, మానవ హక్కుల నేతల జీవన్‌కుమార్, పౌర హక్కుల నేత సజయ, పీవోడబ్ల్యూ సంధ్య కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్టును ఎండగట్టారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన సమావేశంలో మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న విధ్వంసాన్ని నిలువరించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Haragopal
మూసీ విధ్వంసంతో ప్రజా ఆందోళన తప్పదు..
ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం… ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవడం లేదు. ముఖ్యంగా మూసీ వ్యవహారంలో ప్రజల ప్రమేయం లేకుండానే ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు, మూసీ నది మనుగడుతో పాటు, పరీవాహక జనాలకు ఏ అభివృద్ధి అయినా… సహజసిద్ధంగానే ఉండాలి. పర్యావరణానికి ఏమాత్రం నష్టం చేయకుండా అభివృద్ధి అవసరం. అంతేకాదు ప్రజా ప్రమేయంతో ప్రాజెక్టులను చేపట్టాలి. అభివృద్ధి పేరిట మూసీ పరీవాహక ప్రాంత జనాలను బలవంతంగా తరిమివేయాలని చూస్తే సర్కార్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రకృతిని విధ్వంసం చేసి, ప్రజలకు నష్టం చేసే విధానాలను అడ్డుకోవాల్సిందే. మూసీ వెంబడి వేలాది కుటుంబాలను తరలిస్తున్న సర్కార్..వారికి అక్కడే నివాస సౌకర్యాలను కల్పించాలి. ఈ ప్రాజెక్టును కాంట్రాక్టుల కోణంలో ఆలోచించకుండా, ప్రజా కోణంలో ఆలోచన చేయాలి. థేమ్స్ నదిని ఆదర్శంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అక్కడ ఉన్న పర్యావరణ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ప్రజల తరఫున ఆలోచన చేసి, ప్రకృతి విధ్వంసానికి ఆస్కారం లేనప్పుడే సహకరిస్తాం. బలప్రయోగం చేసి ప్రాజెక్టును చేపట్టాలని చూస్తే.. ప్రజా వ్యతిరేకతతో ప్రజాందోళన వస్తుందని సర్కార్‌ను హెచ్చరిస్తున్నాం.
– ప్రొఫెసర్ హరగోపాల్
అశాస్త్రీయ విధానాలతో మూసీ అభివృద్ధి
నది ప్రక్షాళన అత్యంత కీలకం. కానీ కాంక్రీట్ కట్టడాల పేరిట జరిగే విధ్వంసం అక్కర్లేదు. సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే… జీరో లిక్విడ్ డిశ్చార్జి విధానాన్ని పకడ్బందీగా అమలు చేసి, మూసీలో యథేచ్ఛగా కలుస్తున్న ఫార్మా, పరిశ్రమల వ్యర్థాలను నిలువరించాలి. హైదరాబాద్ నగరంలో ఉన్న వాటర్ బోర్డు నీటి చట్టాన్ని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా కలుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నది నిర్వీర్యం కావడంలో పీసీబీ, వాటర్ బోర్డు నిర్వాకమేనని, అందుకే జనాలు గొంతెత్తుతున్నారు. ఫైవ్ స్టార్ హోటల్లో జరిగే సమీక్షలు, సమావేశాలు, విదేశీ సంస్థల మాటున మూసీ పునర్జీవంపై గొప్పలు పొందుతుంది. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పెద్దల వద్ద ఎందుకు సమాచారం లేదనీ, ఎందుకు స్పష్టతనివ్వడం లేదు. అశాస్త్రీయ విధానాలతో సర్కారు మూసీ నదిని నిర్వీర్యం చేసేలా వ్యవహారిస్తోంది. సర్కారు విఫలమైందీ కాబట్టే, ప్రజా సంఘాలు, పౌర సమాజం తమ హక్కులను పరిరక్షించుకునేలా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది.
-బాబురావు, విశ్రాంత శాస్త్రవేత్త
పారదర్శకత లోపించింది
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు అందరూ కోరుకునేది. నగరంలో 55 కిలోమీటర్లు ప్రవహించే జీవ నది పేరిట అప్రకటిత ఉద్దేశాలతో కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టును చేపడుతున్నది. ఎలాంటి ప్రమాణాలు లేకుండా, నిపుణుల కమిటీ పేరిట అబద్ధాలతో నిర్మితమవుతుంది. మూసీ నదిని అభివృద్ధి చేసి, దిగువన ఉండే రైతులకు లబ్ధి చేకూర్చేలా పర్యావరణహితంగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఇవేవి జరగడం లేదు. కార్పొరేట్, ఫార్మా కంపెనీల కోసం, అక్కడి నుంచి వచ్చే కలుషితాన్ని నియంత్రించకుండా… మూసీ వెంబడి 30 మీటర్ల రోడ్లును ఎలా వేస్తున్నారు. 20 మీటర్ల ఎకో జోన్ అంటున్నారు. రోడ్లు, చెక్ డ్యాంల పేరిట కాంక్రీట్ నిర్మాణాలతో సాగుతోంది. ఎక్కడో వ్యతిరేకించిన ప్రాజెక్టులను, ప్రజామోదమైన ప్రాజెక్టు కాదని చెబుతున్నా..మూసీ నదిని 7050 కోట్ల రూపాయలతో నిర్మించాలని చూస్తున్నారు. మూసీ పేరిట సీఎం రేవంత్ రంగుల ప్రపంచాన్ని చూపించారు. కానీ ఈ ప్రాజెక్టు కారణంగా కూలిపోయే భవనాలు ఎన్ని..కుటుంబాలు ఎన్ని.. నష్టపోతున్న జీవనోపాధికి సర్కార్ చేపడుతున్న చర్యలేంటీ? కాంక్రీట్ నిర్మాణాలతో కలిగే పర్యావరణ సమస్యలపై ముందుగా స్పష్టతనిచ్చి, పరిష్కార మార్గాలను పారదర్శకంగా వివరించాలి.
– అల్లం నారాయణ, మీడియా అకాడమీ మాజీ చైర్మన్
మూసీని చూస్తే ముక్కు మూసుకోవాల్సిందే
ఇప్పుడున్న మూసీ నది ఎప్పుడో కలుషితమైంది. అనంతగిరి కొండల నుంచి నల్లగొండలోని వాడపల్లి వరకు ప్రవహించే మూసీ నది ఎప్పుడో విషతుల్యమైంది. ఇందులో ఎన్నో ఫార్మా, కార్పొరేట్ కంపెనీల హస్తం ఉంది. ఇందులో రెండు రిజర్వాయర్ల కింద నుంచి వచ్చే మూసీ నది జన్మస్థానం నుంచే ఫార్మా కంపెనీల వ్యర్థాలు కలుస్తున్నాయి. ఎన్నో ఫార్మా కంపెనీలు, మరెన్నో పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు యథేచ్ఛగా కలుస్తున్నాయి. 90వ దశకంలోనే మూసీ నదిలో పరిమితికి మించి రేడియో ధార్మిక కారకాలు మూసీ నదిలో కలుస్తున్నాయని పరిశోధన ఫలితాలు ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన రసాయనాలతో కలిసి కృష్ణా నది వరకు మూసీ కలుషితం అవుతుంది. నది అంటే ప్రవహించాలి. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో డ్యాములను కూల్చివేస్తుంటే.. ఇక్కడ చెక్ డ్యాంలను కట్టే ప్రణాళికలను పూర్తిగా వ్యతిరేకించాలి. మెగా కృష్ణా రెడ్డి లాంటి కాంట్రాక్టర్ల కోసమే ఈ తరహా ప్రాజెక్టుల కోసమే ప్రభుత్వం చేపడుతోంది. మూసీ నదిలో కలుస్తున్న బయోవ్యర్థాలతోపాటు, కాంట్రాక్టర్ల అవినీతి కంపు కూడా దాగి ఉండటంతో ఈ ప్రాజెక్టు విషయంలో సర్కారుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.
– పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్
ప్రజల భాగస్వామ్యం లేకపోవడం దురదృష్టకరం
సజీవమైన మూసీ నది ప్రక్షాళనలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడం దురదృష్టకరం. గాంధీజీ నిజంగా బతికే ఉంటే.. సరోవర్ ప్రాజెక్టును కూడా వ్యతిరేకించేలా నది అభివృద్ధి జరుగుతోంది. అభివృద్ధి పేరిట స్థానికులను తరలిస్తున్నారు తప్పా మూసీ నది ప్రక్షాళనలో భాగస్వామ్యం చేయడం లేదు. ప్రాజెక్టుల్లో బాధితులను భాగస్వామ్యులను చేస్తూ అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూసీ నది పేరిట సర్కార్ పరీవాహక ప్రాంతాల్లోని జనాలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తోంది. అందుకే మధు రిడ్జ్ పార్కు నివాసాలకు జీరో వ్యాల్యు పేరిట భయపెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ప్రజాభిప్రాయాన్ని ఖూనీ చేసేలా ప్రాజెక్టు విధివిధానాలు ఉన్నాయి.
– సీనియర్ పాత్రికేయులు కే. శ్రీనివాస్
చట్టాలను ఉల్లంఘించి మూసీ ప్రాజెక్టు
చట్టాలను ఉల్లంఘించి మూసీ పునర్జీవం ప్రాజెక్టు చేపడుతోంది. పర్యావరణ చట్టాల్లోని సెక్షన్ 10ఏను వినియోగించి నిర్బంధంగా ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఎందుకు ? కేవలం ఇక్కడ ఉన్న ఇండ్లను ఖాళీ చేయించాలని చూస్తున్న సర్కార్‌కు చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఈ ప్రాజెక్టు కోసం తమ ఆస్తులను ఇవ్వలేం. కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగకుండా..ఎలాంటి ప్రతిపాదనలను వివరించకుండా ప్రజలను మోసం చేసే క్రమంలో జనాలతో సంప్రదింపులు లేకుండా, అధికారులు నిర్వహిస్తున్న సమావేశాలను బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది.
– విశాలాక్షి, హైదర్ షా కోట్ నివాసి
సమస్యపై ఎలుగెత్తాలంటే సెలబ్రిటీలే కానక్కర్లేదు
మూసీ వెంబడి జరుగుతున్న విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయి. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2016లో మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం రెండ్రోజులు నిరాహార దీక్ష కోసం ఎందుకు కూర్చున్నారనే ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పి…..ఇప్పడు మూసీ ప్రాజెక్టును చేపట్టాలి. ప్రజలను నిర్వాసితులను చేసే ఏ ప్రాజెక్టునైనా జనాలు అడ్డుకుంటారు. అప్పుడు మల్లన్న సాగర్‌లో ప్రజా వ్యతిరేకంగా సాగుతుందనీ నిలబడిన మీరే… ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరిట మీరు చేసే పనులతో 10వేల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అధికారిక ఆమోదం లేకుండా 12వేల కుటుంబాలను ఏ ప్రాతిపదికను ప్రాజెక్టును చేపడుతున్నారు. మూసీ పేరిట పెద్ద కుట్ర సాగుతోంది. ముక్కలు ముక్కలు చేసి నది పేరిట అభివృద్ధి చేయాలని చేయడం వెనుక భారీ కుట్రనే ఉందనే విషయం స్పష్టం అవుతుంది. మూసీ పునర్జీవం పేరిట ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కుట్రలను తిప్పికొడితే… తెలంగాణ నుంచి తరిమికొట్టినట్లుగానే, అదే తరహాలో వ్యవహారిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తరిమికొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మూసీ నదిపై జరిగే అభివృద్ధిని వివరించాల్సిన సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగాలు వాస్తవాలను దాచిపెడుతున్నాయి.
– సజయ, స్వచ్ఛంద కార్యకర్త
మూసీ నది వెంబడి జనాలను పట్టించుకోలేదు
మూసీ అంటేనే ఇక్కడి ప్రజలతో మమేకమైన అంశం. చారిత్రక, వారసత్వ మూలాలతో కూడిన జీవనదిని కాంక్రీట్ గోడలతో బంధిస్తే జరిగే పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా మూసీ నదిని ప్రక్షాళన చేయడమే తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకొంటున్న సీఎం రేవంత్ రెడ్డి… ఇప్పటివరకు మూసీలో కలుస్తున్న మురుగునీటికి, పారిశ్రామిక వ్యర్థాలకు పరిష్కారం చూపిస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని, ఉద్యమ నేపథ్యం లేని ఓ పార్టీ నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజల జీవితాల గురించి ఏమాత్రం ఆలోచన చేయడం లేదు. డీపీఆర్, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, లక్షల కోట్లతో నైట్ లైఫ్ సిటీ అంటూ, మూసీ వెంబడి ఆకాశ హర్మ్యాల పేరిట అభివృద్ధిని కాగితాల్లో చూపిస్తూ జనాలను ముంచేలా వ్యవహరిస్తున్నారు. వేలాది ఇళ్లను కూల్చడం అభివృద్ధి కాదనీ, ప్రాజెక్టు పేరిట జరిగే జీవనది విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడుతాం.
– పీవోడబ్ల్యూ సంధ్య
విధ్వంసకరమైన విధానాలను అడ్డుకుంటాం
సబర్మతి తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం..మూసీ ఒక ఫెయిల్యూర్ అంశంగా మారే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణపై ఏమాత్రం అవగాహన లేకుండా జరిగే అభివృద్ధిని ఏ ఒక్కరూ కోరుకోవడంలేదు. ముఖ్యంగా అలాంటి ప్రణాళికలతో వచ్చే విధ్వంసకరమైన విధానాలను కచ్చితంగా అడ్డుకుంటాం.
– రుచి, సేవ్ మూసీ నిర్వాహకులు
జీవనోపాధి లేకుండా పోతుంది
మూసీ నది వెంబడి నివాసాలతో వేలాది మంది డొమెస్టిక్ వర్కర్లు ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారు. అక్కడ పనిచేసుకుంటూ, చాలీచాలనీ జీవనోపాధి అవకాశాలతో పిల్లలను చదివించుకుంటూ, కుటుంబాలను నెట్టుకువచ్చే మహిళలు ఎంతో మంది ఉన్నారు. కేవలం కాంట్రాక్టుల పేరిట వచ్చే డబ్బుల కోసమని, ఈ ప్రాంతమే జీవనాధారంగా బతికే పేదల పొట్ట కొట్టవద్దు. ఇక్కడ నివసించే ఎంతో మంది మహిళలు, పేదలకు నష్టం చేయకుండా ఎలాంటి అభివృద్ధి ప్రణాళికనైనా ఆమోదిస్తాం.
– ఫాలియా, డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్
మరో కలుషిత నదిగా మూసీ మారనుంది
ఇప్పటివరకు రెండు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను దేశంలో ప్రకటించారు. అందులో ఒకటి సబర్మతి, రెండోది మూసీ. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కూడా వేలాది మంది జనాల ఇండ్లను కూల్చి, వేల కోట్ల రూపాయలతో చేపడితే… చివరకు ఈ ప్రాజెక్టు కాస్తా దేశంలోనే రెండో అతిపెద్ద కాలుష్య నదిగా సబర్మతిగా మారిపోయిందని ప్రభుత్వమే వెల్లడించింది. ఇప్పుడు అదే తరహాలో మూసీ నది కూడా మారనుంది. మూసీ నదిలోకి చేరే కాలుష్య కారకాలను అడ్డుకోకుండా,లక్షల కోట్లు కుమ్మరించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటివరకు సర్కారు చేపట్టే ప్రాజెక్టుతో ఎంత మంది ప్రభావితం అవుతున్నారన్న విషయాన్ని కూడా స్పష్టం చేయకుండా, జనాలను గందరగోళంలో పడేస్తోంది. సర్కారుకు మూసీన నదిని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశమే ఉంటే ముందుగా ప్రజలతో మమేకమై… ప్రజామోదమైన ప్రతిపాదనలను తీసుకురావాలి. అప్పుడే ఎలాంటి వ్యతిరేకత లేకుండా ప్రాజెక్టు అమలు అవుతుంది.
– వర్గీస్, చత్రి స్వచ్ఛ్చంద సంస్థ
ప్రధాన డిమాండ్లు ఇవే
మూసీ ప్రాజెక్టులో ఉన్న ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లోని లోపాలపై ముందు గా స్పష్టతనివ్వాలి. ప్రాజెక్టు పేరిట జరిగే కాంట్రాక్టు నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి.
గాంధీ సరోవర్ సహా మొత్తం ఏడు చెక్ డ్యాములకు సంబంధించిన టెక్నికల్ అంశాలను వివరించాలి. ముంపు విస్తీర్ణం, నిల్వ సామర్థ్యం, బ్యాక్ వాటర్, ఆపరేటింగ్ లెవల్స్, స్పిల్ వే సామర్థ్యం, డ్యామ్ భద్రతాను ముందుగా జనాలకు వివరించాలి.
మూసీకి అవసరమైన పర్యావరణ ప్రవాహాన్ని శాస్త్రీయంగా నిర్ణయించేందుకు నిర్ధిష్టమైన ప్రాంతానికి సంబంధించిన సమగ్ర జల విజ్ఞాన, పర్యావరణ అధ్యయనం చేయాలి.
ఈఐఏలో పేర్కొన్న 1 ఇన్ 100 సంవత్సరాల వరద అంచనాను ప్రాజెక్టు రూపకల్పన, నిర్వహణ విధానాలు, అత్యవసర ప్రణాళికలు, ప్రజా హెచ్చరిక వ్యవస్థలు పనితీరును పేర్కొన్నాలి.
ప్రాజెక్టు ప్రాంతం, నది కారిడార్, బఫర్ జోన్, నిర్మాణాలు, రహదారులు, ప్రజాప్రయోజన ప్రాంతాలు, ఇతర ప్రతిపాదిత అభివృద్ధి పనులను స్పష్టంగా పేర్కొన్నాలి.
పునరావాసం, పునరావాస, ప్రణాళికలను ఖరారు చేసే ముందు ప్రభావిత, నిర్వాసిత, కుటుంబాలు, నిర్మాణాలు, భూములు, జీవనోపాధులపై సమగ్రమైన సామాజిక ఆర్థిక గణన జరగాలి.