నిర్మల్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా, బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పథకాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని ఆరోపిస్తూ నిర్మల్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాలతోపాటు, మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేసి స్థానిక తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
బాసర తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ మండల అధ్యక్షుడు కోర్వ శ్యాం ఆందోళన నిర్వహించారు. కడెం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.ఖానాపూర్ మండలంలోని తెలంగాణ చౌక్ వద్ద మండల అధ్యక్షుడు తాళ్లపల్లి రాజగంగన్న ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం తెలంగాణ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. తానూర్‌లో బీఆర్ఎస్ నాయకురాలు పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ మహేందర్నాథ్కు వినతి పత్రం అందజేశారు.
ఆయా నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహ భారాన్ని తగ్గించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం తమ అనుకూల వ్యక్తులతో కోర్టులో కేసులు వేయించి నాటకాలాడుతున్నదని మండిపడ్డారు. పథకాలను కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టమైన అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేలకు పైగా అర్హులైన ఆడబిడ్డలకు తులం బంగారం అందాల్సి ఉన్నదన్నారు.
కల్యాణలక్ష్మితోపాటు మహిళలకు ప్రతినెల రూ.2500, రూ.500లకే వంటగ్యాస్, రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు, ఆసరా పథకం కింద రూ.4 వేల పెన్షన్ వంటి హామీలన్నింటినీ గాలికొదిలేశారని విమర్శించారు. అలాగే కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్ వంటి వాటిని పక్కన బెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అన్నం పెట్టే రైతన్నకు కాంగ్రెస్ పాలనలో సక్రమంగా ఎరువులు కూడా అందడం లేదని, ఎరువుల పంపిణీలో యాప్ విధానాన్ని తీసుకొచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు మరిచిపోవడం ప్రజలను వంచించడమే అవుతుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిథిగా కొనసాగించే వరకు, లబ్ధిదారులకు తులం బంగారం అందించే వరకు బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని పలువురు నాయకులు స్పష్టం చేశారు.
ఆదిలాబాద్‌లో..
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగాయి. కల్యాణలక్ష్మి-షాదిముబారక్ పథకాన్ని రద్దు చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్ ఆరోపించారు. మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఉట్నూర్ అంబేద్కర్ చౌక్‌లోని ప్రధాన రహదారిపై మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంద్ర జైవంత్‌రావు ధర్నా చేశారు.