తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యాలయం ఆవరణలోగల ప్రాంగణంలో ప్రత్యేక యోగా శిబిరాన్ని ఏర్పాటు చేసి అనేక ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ.. యోగా మన శరీరానికి, మనస్సుకు సమతౌల్యం కలిగించే అమూల్యమైన సాధనం అన్నారు. రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తే శారీరక ఆరోగ్యం మెరుగవడమే కాకుండా, మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తి కూడా కలుగుతుందన్నారు.
పోలీస్ శాఖలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి ఎక్కువగా ఒత్తిడి ఉంటుందని, అలాంటప్పుడు యోగా ఎంతో ఉపయుక్తమని డీఎస్పీ చెప్పారు. యోగా వల్ల నిత్యం ఉత్సాహంగా పని చేయగలుగుతారని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ యోగా సాధనను తమ జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు సీఐ గణేష్, ఎస్ఐలు ఉపేందర్, రాజు, రమేష్, సంతోష్, కిరణ్, వివిధ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.