నర్సింహులపేట, ఫిబ్రవరి 20: మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad) యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిరుప పంటలకు యూరియా వేసేందుకు బస్తాలు దొరకకపోవడంతో 10 రోజులుగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో యూరియా కోసం నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పోలీసుల పహారాలో అధికారులు యూరియాను పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్లో ఉన్న రైతులకు పోలీసులే కూపన్లు అందిస్తున్నారు.
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మందు బస్తాలకు వచ్చిన కష్టం మళ్లీ వచ్చిందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహకార కేంద్రానికి 444 యూరియా బస్తాలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. అయితే రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావచ్చారని, అందరికీ సరిపోకపోవడంతో రైతుకు రెండు నుంచి నాలుగు బస్తాలు మాత్రమే ఇస్తున్నామన్నారు. ఎక్కువ మొత్తంలో వరి మొక్కజొన్న సాగుచేసిన వారికి అవి ఎలా సరిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల వ్యాప్తంగా 22 గ్రామాల్లో బావులు, చెరువులు, వాగను నమ్ముకుని వరి పంట 5,215 ఎకరాలు, మొక్కజొన్న 8 వేల ఎకరాల్లో సాగు చేశారు. పంటలకు సరిపడా యూరియా(Urea shortage) అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి నాటు వేసి నెలరోజులైనా ఒక్కసారి కూడా యూరియా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాల్లో లైన్లో ఉన్నవారికి కాకుండా పైరవీకారులకు పెద్ద ఎత్తున యూరియా బస్తాలు ఇస్తున్నారని సిబ్బందితో గొడవ దిగుతున్నారు.