Urea | యూరియా బస్తాలు దొరక్క, పంట నష్టపోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడ మండలం బుర్కగుంపునకు చెందిన మల్యాల నరసయ్య తనకు ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. అయితే యూరియా బస్తాల కోసం గత నెల రోజులుగా చెప్పులరిగేలా తిరుగుతున్నాడు. కానీ ఒక్క బస్తా కూడా యూరియా దొరకడం లేదు. దీంతో కళ్ల ముందే పంట ఆగమవుతుంటే నరసయ్య తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో శనివారం నాడు తన పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు.. నరసయ్యనను వెంటనే కొత్తగూడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి తరలించారు.
యూరియా అందక పంట నష్ట పోతుందని రైతు ఆత్మహత్యయత్నం
మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో యూరియా పంపిణీ కేంద్రం వద్ద యూరియా అందక పంట నష్ట పోతుందని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసిన మల్యాల నరసయ్య అనే రైతు
చికిత్స నిమిత్తం నర్సంపేట ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/U7PQZFZZnJ
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2025
రైతు ఆత్మహత్యకు యత్నించాడనే సమాచారం తెలుసుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటనే అధికారులకు కాల్ చేసి మాట్లాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతు నరసయ్యకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నా స్థానిక ఎమ్మెల్యేలుగానీ.. మంత్రులు గానీ, ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. అసమర్థ ప్రభుత్వం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. యూరియా దొరక్క పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడొద్దని.. పంటల కంటే ప్రాణాలు ముఖ్యమని చెప్పారు. రైతులందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు.