తొర్రూరు : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆ ఇండ్లను ముట్టడించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొర్రూరు పట్టణంలో గోపాలగిరి రోడ్డులో నిర్మించిన 280 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడంతో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ముట్టడించారు.
గత నాలుగు రోజులుగా పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తుండగా, శనివారం గోపాలగిరి రోడ్డులో ఉన్న ఇండ్లను ముట్టడి చేశారు. ఈ సందర్భంగా అర్హులైన పేదలు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితమే తమకు ఇండ్లు కేటాయించామని చెప్పారని, కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటివరకు ఇండ్ల పంపిణీ జరగలేదని అన్నారు. వెంటనే ఇళ్ల పంపిణీ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ తౌటం గణేష్, తహసీల్దార్ గడిల శ్రీనివాస్, ఆర్ఐ నిజాముద్దీన్, అధికారులు చేరుకుని సీపీఎం నాయకులు, మహిళలతో చర్చించారు. అంతిమంగా అధికారులు 45 రోజుల్లోగా అర్హులైన పేదలను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో నిరసనను తాత్కాలికంగా విరమించారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ తౌటం గణేష్, తహసీల్దార్ గడీల శ్రీనివాస్, ఆర్ఐ నిజాముద్దీన్, అధికారులు శ్రీనవాస్ రాజు, ఎండీ యాకూబ్, మంజుల, ఉపేంద్ర, కళ్యాణి, వీరమ్మ, జమిళ, రేణుక, భవాని, లింగమ్మ, విజయ, పద్మ, యకమ్మ, సమ్మక్క, రేణుక, షామైన, సౌజన్య, నీరజ, శిరీష, సరోజన, సంతోషిణి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.