గూడూరు, మార్చి 9: గొంతులో పల్లిగింజ(Peanut ) ఇరుక్కొని చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలోని నాయకపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గుండెల కల్పన -వీరన్న (18 నెలల)కుమారుడు అక్షయ్ గత శుక్రవారం తన ఇద్దరు అక్కయ్యలతో కలిసి ఇంట్లో పల్లి గింజలు తిన్నాడు. ఈ క్రమంలో అక్షయ్ గొంతులో పల్లి గింజ అడ్డుగా ఇరుక్కుపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు నీటిని తాగించారు. దీంతో కొంత సర్దుకున్న అక్షయ్ శనివారం రోజు విపరీతంగా ఎక్కిళ్లతో బాధపడుతూ ఉండగా తల్లిదండ్రులు స్థానిక దవాఖానకు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. వైద్యులు అక్షయ్ కడుపులో పల్లి గింజలు తొలగించారు. ఈ క్రమంలో అక్షయ్కి విపరీతమైన జ్వరం రావడంతో పాటు ఫిట్స్ కూడా వచ్చాయి. దీంతో తట్టుకోలేక అక్షయ్ ఆదివారం ఉదయం మృతి చెందాడు. అక్షయ మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. అక్షయ్ మృతదేహాన్ని గ్రామానికి తరలించగా గ్రామస్తులు కూడా కంటనీరు పెట్టారు.