Sathyavathi Rathod |కురవి, ఫిబ్రవరి 08: విదేశీ విద్య పథకం కింద అమెరికాలో చదువుకుంటున్న అన్ని కులాల విద్యార్థుల కోసం పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. విద్యార్థులు భయపడవద్దని ధైర్యం చెప్పారు. విదేశీ విద్య పథకంతో అమెరికా వెళ్లి గోస పడుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి జూమ్ మీటింగ్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల గోడును ఆలకించారు. అనంతరరం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.20లక్షల స్కాలర్ షిప్ను అందించిందని సత్యవతి రాథోడ్ తెలిపారు. 127 మంది ఎస్టీ విద్యార్థులకు మొదటి విడతగా రూ.10లక్షలు చెల్లించామని, రెండో దఫా చెల్లించే సమయానికి ఎన్నికలు వచ్చాయని పేర్కొన్నారు. 127 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ అందక అమెరికాలో అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండో దఫా స్కాలర్షిప్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసి అందివ్వలేదని విమర్శించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ కమిటీ వేయలేదని ఆరోపించారు. రూ.25 లక్షలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రెండో ధఫా డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు.
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా చేస్తున్నారని సత్యవతి రాథోడ్ తెలిపారు. దీంతో అమెరికాలో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను కూడగట్టి అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని అన్నారు. అన్నికులాల విద్యార్థుల కోసం పోరాటం చేస్తామని.. విద్యార్థులు భయపడవద్దని భరోసానిచ్చారు.