Sathyavathi Rathod | కురవి, ఫిబ్రవరి 08: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కనాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించలేదని.. కానీ ఢిల్లీకి మాత్రం 30 సార్లు వెళ్లొచ్చారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.
శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా నియమితులైన తర్వాత తొలిసారి కురవికి వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారిని శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాటు రైతులను రాజులుగా చేశారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కసారి కూడా పరామర్శించలేదని విమర్శించారు.
బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ మరోమారు మోసం చేయబోతున్నదని సత్యవతి రాథోడ్ విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు నిర్వహిస్తే, కాంగ్రెస్ చేసిన సర్వే తప్పులతడకగాఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచైనా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తనకు శాసనమండలిలో విప్ గా ఇవ్వడం పట్ల సత్యవతి రాథోడ్ ఆనందం వ్యక్తం చేశారు. పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి విధేయతగా ఉంటానని తెలిపారు. వారు నాపై చూపే అభిమానానికి కృతజ్ఞురాలిని అని అన్నారు.
మాజీ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ కు పరామర్శ
కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్ పర్సన్ బజ్జూరి ఉమా పిచ్చిరెడ్డి ఇటీవల మోకాలి శస్త్ర చికిత్సచేయించుకోగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఆరోగ్య యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.