గూడూరు, ఫిబ్రవరి 7 : అస్వస్థతతకు గురైన(Students illness) ఇద్దరు విద్యార్థులు దవఖానలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం దామరవంచ గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు విరోచనాలతో శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడవ తరగతి చదువుతున్న లాకావత్ రాహుల్, 9వ తరగతి చదువుతున్న గుగులోతు సాయి ప్రసాద్ గురువారం అర్ధరాత్రి నుంచి విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. శుక్రవారం ఉదయం వరకు కూడా విరోచనాలు తగ్గకపోవడంతో పాఠశాలలోని ఉపాధ్యాయుని సహాయంతో మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్ సి) లో చికిత్స నిమిత్తం చేరారు.
ఆశ్రమ పాఠశాలలో 530 మందికి పైగా విద్యార్థులు ఉండగా ఇద్దరికీ అస్వస్థతకు గురికావడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయుడు విద్యార్థులను సకాలంలో దవఖానలో చేర్పించి దవఖానలోని వైద్య సిబ్బందితో చికిత్స అందించారు. ఈ విషయంపై వైద్య సిబ్బందితో మాట్లాడగా ప్రస్తుతం విద్యార్థుల విరోచనాలు తగ్గాయని వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కాగా పాఠశాలలో అధికారులు పర్యవేక్షణ నిరంతరం ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల అస్వస్థత పై తమకు తెలిసిన వెంటనే దవాఖానకు తరలించినట్లు వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు.