Drugs | వరంగల్ చౌరస్తా, ఆగస్టు : చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా, ఉన్నత విద్యాబ్యాసాన్ని పొంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వరంగల్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ డీఎస్పీ రమేష్ బాబు అన్నారు. బుధవారం 27వ డివిజన్ పరిధిలోని రాయపుర గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి, వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మత్తు పదార్థాల సేవనంతో జీవితం నాశనమవుతుందని అన్నారు. చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలని, తద్వారా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, పుట్టిన ఊరికి మంచి పేరును తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. విద్యార్థి దశలోనే భవిష్యత్తు లక్ష్యాలను ఎంచుకొని అందుకు తగిన విధంగా ముందుకు సాగాలని అన్నారు. కష్టపడితే సాధించలేనిది లేదని అన్నారు.
డీఎంహెచ్ సాంబశివరావు మాట్లాడుతూ.. నేను మీలానే గిరిజన సంక్షేమ శాఖ గురుకులంలో విద్యాబ్యాసం చేసిన వాడినేనని అన్నారు. భవిష్యత్తు లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడానికి కృషి చేస్తూనే ఉండాలని అన్నారు. అనంతరం మిషన్ పరివర్తన్ లక్ష్యాన్ని షాట్ ఫిలిం రూపంలో విద్యార్ధుల ముందు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయుడు హెమంత్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి అరుణ, హేమలత, అనిరుద్, పావని, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Heavy Rains | అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సై కీలక ఆదేశాలు
Road Repair | ఆదమరిస్తే అంతే.. సారూ ఈ రోడ్లకు జర మరమ్మతులు చేయించండి
గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు అవస్థలు