Heavy Rains | నిజాంపేట్, ఆగస్టు12 :ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఎవరు ఉండరాదని ఎస్సై మధుసూదన్ రెడ్డి సూచించారు. పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ నీటిలోకి వెళ్లొద్దని తెలిపారు. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాటి వద్దకు వెళ్ళవద్దని, దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా మనుషులు వెళ్లొద్దని, పశువులను కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను రోడ్లపైకి వెళ్లకుండా చూసుకోవాలని తెలిపారు. ఎవరైనా ఆపదలో ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ కు, అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేస్తే సహాయాన్ని అందిస్తారని పేర్కొన్నారు.