అచ్చంపేట, మార్చి 2 : టాలీవుడ్ అగ్ర తారలు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న వివాహం అనంతరం మొదటిసారిగా సొంతూరికి రావడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మెన్‌పేటలో సోమవారం జరిగిన వివాహ విందు కార్యక్రమం ఆత్మీయత, ఆనందం, ఉత్సాహంతో జరిగింది. నవ దంపతులకు గ్రామస్తులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతిపట్టి, బొట్టుపెట్టి ఆహ్వానించారు.
కోలాటాలు, డప్పుల నృత్యాలు, సంప్రదాయ కళారూపాలతో గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నది. తుమ్మెన్‌పేటలో ఎనిమిది ఎకరాల ఫామ్‌హౌస్‌లో నూతనంగా అందమైన భవనం నిర్మించారు. ఇంటిలో నవ దంపతులు పూజలు చేశారు. తర్వాత సత్యనారాయణస్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌తోపాటు నాయకులు, అధికారులు ఈ వేడుకకు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఊరిలో పొలం కొని వ్యవసాయం చేద్దాం. ఇల్లు కట్టుకుందాం అని నాన్న అంటుండేవారు. ఆ కోరిక తీరినందుకు సంతోషంగా ఉంది. ఊరికి చేసేది చాలా ఉంది. ఇక నుంచి గ్రామానికి రెగ్యులర్‌గా వస్తాం. తమ్ముడు ఆనంద్ పెళ్లి కూడా ఇక్కడే చేస్తాం. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజక వర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది నుంచే స్కాలర్షిప్లు అందిస్తాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యం ఉంది. నాన్న గోవర్ధన్ రావు కోరిక మేరకు ఊరిలో విందు ఏర్పాటు చేశాం. మొదటిసారి నేను పుట్టిన ఊరికి రావడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.